మొరాయిస్తున్న గేట్లు
● ప్రవహిస్తున్న వరద జలాలు
● కండలేరు కాలువ షట్టర్లు దించేందుకు అధికారుల యత్నం
● కానరాని ప్రయోజనం
సోమశిల: సోమశిల నుంచి కండలేరుకు జలాలను సరఫరా చేసే వరద కాలువ పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రాజెక్ట్ దక్షిణ భాగంలో ఉన్న వరద కాలువ గేట్ల లీకేజీని అరికట్టేందుకు ఎన్ని యత్నాలు చేస్తున్నా, ఫలితం కానరావడంలేదని తెలుస్తోంది. కాలువకు మూడు గేట్లుండగా, రెండోది మరమ్మతులకు గురై మొరాయించింది. మిగిలిన 1, 3 ద్వారా కండలేరు జలాశయానికి నీటిని సరఫరా చేస్తున్నారు. ఇది పూర్తి సామర్థ్యానికి చేరుకోనున్న తరుణంలో ఇక నీటి సరఫరాను నిలిపేయాలనే అధికారుల ఆదేశాలతో 1, 3 గేట్లను దించే యత్నాలు చేపట్టారు. ఒకటో నంబర్ గేట్‌కు జాకీలు పెట్టి దించేందుకు యత్నించగా, ఒక అడుగులో ఇరుక్కుపోయింది. మూడో నంబర్ గేట్‌ను దించే పనులను గురువారం ప్రారంభించారు. ఇది పూర్తిగా దిగకపోతే భారీ స్థాయిలో వరద జలాలు లీకేజీ రూపంలో ప్రవహిస్తూనే ఉంటాయని పలువురు పేర్కొంటున్నారు.
20,960 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
సోమశిల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల దృష్ట్యా జలాశయానికి 20,960 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. 69.442 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 7, 8, 9వ క్రస్ట్ గేట్ల నుంచి పెన్నాకు 42,460.. కండలేరు కాలువకు 560.. ఉత్తర కాలువకు 50 క్యూసెక్కుల మేర విడుదల చేస్తున్నారు. 99.408 మీటర్ల నీటిమట్టం నమోదైంది.
దించేందుకు యత్నిస్తున్నాం
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గేట్లను దించేందుకు కొన్ని రోజులుగా పనులు చేస్తున్నాం. ఒకటో నంబర్ గేట్‌ను సాధ్యమైనంత వరకు దించారు. మూడో నంబర్ గేట్ పనులను ప్రారంభించాం. త్వరలో పూర్తి చేసి నీటి లీకేజీని అరికట్టేందుకు యత్నిస్తాం. కాలువ ద్వారా 560 క్యూసెక్కులు ప్రస్తుతం విడుదలవుతున్నాయి.
– శరత్, జేఈఈ, కండలేరు కాలువ


