పోలీసుల తీరుపై అనుమానాలు | - | Sakshi
Sakshi News home page

పోలీసుల తీరుపై అనుమానాలు

Oct 24 2025 2:34 AM | Updated on Oct 24 2025 2:34 AM

పోలీస

పోలీసుల తీరుపై అనుమానాలు

సాక్షి నెట్‌వర్క్‌: గుడ్లూరు మండలం దారకానిపాడుకు చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు అనే కాపు యువకుడ్ని ఈ నెల రెండున హతమార్చారు. అదే గ్రామానికి చెందిన కాకర్ల హరిచంద్రప్రసాద్‌ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తన సోదరులైన పవన్‌, భార్గవనాయుడితో కలిసి దసరా రోజున బైక్‌పై వస్తుండగా, హరిచంద్రప్రసాద్‌ తన కారుతో ఢీకొన్నారు. ఘటనలో లక్ష్మీనాయుడు అక్కడికక్కడే మరణించగా.. పవన్‌, భార్గవనాయుడు తీవ్రంగా గాయపడి గుంటూరులోని హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని హత్య కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఇందులో భాగంగా హరిచంద్రప్రసాద్‌తో పాటు సహకరించిన తండ్రి మాధవరావును అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు.

రెచ్చగొట్టిన వారిపై చర్యలేవీ..?

హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఇద్దరు మహిళలను నిందితులుగా నేటికీ చేర్చలేదు. హరిచంద్రప్రసాద్‌ తీసుకెళ్లిన కారులోనే అతని భార్య, నానమ్మ కూడా ఉన్నారనేది ప్రత్యక్ష సాక్షుల కథనం. కారుతో ఢీకొన్నాక కిందపడిన వారిపై ఇనుపరాడ్‌తో దాడి చేస్తుంటే వీరిద్దరూ రెచ్చగొట్టి ప్రోత్సహించారని క్షతగాత్రులు పవన్‌, భార్గవనాయుడు సైతం చెప్తున్నారు. అయితే వీరిద్దర్ని మాత్రం నిందితులుగా చేర్చలేదు. లక్ష్మీనాయుడు బైక్‌పై వస్తున్న సమాచారాన్ని హరిచంద్రప్రసాద్‌కు గ్రామానికి చెందిన యువకులే ఫోన్లో తెలియజేశారని, ఈ విషయంలో ముగ్గురు కీలకపాత్ర పోషించారని మృతుడి భార్య సుజాత అనేక సందర్భాల్లో ఆరోపించారు. దాడి అనంతరం హరిచంద్రప్రసాద్‌తో పాటు ఆయనతో ఉన్న ఇద్దరు మహిళలు బైక్‌లపై దారకానిపాడులోకి వెళ్లారు. అసలు వీరిని బైక్‌లపై గ్రామంలోకి ఎవరు తీసుకెళ్లారనేదీ ప్రశ్నే. ఇలాంటి ఎన్నో కీలక అంశాలను ఈ కేసులో వదిలేశారు. కేవలం ఇద్దర్ని మాత్రమే అరెస్ట్‌ చూపించి కేసును క్లోజ్‌ చేసేందుకు పోలీసులు యత్నించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సమాధానం కరువు

లక్ష్మీనాయుడు హత్యను రాష్ట్ర వ్యాప్తంగా కాపు సంఘాలు, కాపు నేతలు తీవ్రంగా పరిగణించాయి. కేసులోని లోపాలపై అటు పోలీసులు, ఇటు ప్రభుత్వాన్ని వారు నిలదీస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కావడంతో పక్కా పథకం ప్రకారం కేసును నీరుగార్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసులో కాపు నేతలు లేవనెత్తుతున్న ఏ ఒక్క ప్రశ్నకూ పోలీసుల నుంచి సమాధానం రావడం లేదు.

ఒత్తిడి తెచ్చిన ఆ నేత ఎవరు..?

గుడ్లూరు పోలీసులపై అధికార పార్టీకి చెందిన కీలక నేత ఒత్తిడి చేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. గుడ్లూరు మండల బాధ్యతలు చూస్తున్న సదరు నేత సూచనలకు అనుగుణంగా ఖాకీలు నడుచుకున్నారని, ఇందులో భాగంగానే కేసును నీరుగార్చేందుకు యత్నించారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. చిన్న దొంగతనం కేసులో సైతం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించే వారు.. ఈ దారుణహత్యకు సంబంధించిన కేసులో ఇలా వ్యవహరించకుండా.. కేసు వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే కాపు సంఘాల ఎంట్రీతో సీన్‌ రివర్స్‌ అయింది. ఈ కేసు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా మారడంతో ఖాకీలు పది రోజులుగా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, మిగిలిన నిందితులను గుర్తిస్తామంటూ తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. ఏదేమైనా అధికార పార్టీ నేతల మెప్పు కోసం యత్నించి చివరికి ఇరుక్కుపోయామనే భావన పోలీస్‌ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది.

ఘటన స్థలంలోనే మృతి చెందిన లక్ష్మీనాయుడు

హత్యకు ఉపయోగించిన కారు

కాపు యువకుడి హత్య కేసు

దర్యాప్తులో గుడ్లూరు ఖాకీల తీరిదీ..

ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న

మహిళలు, సహకరించిన వారిని

కావాలనే వదిలేశారా..?

నిందితుడు హరిచంద్రప్రసాద్‌, అతని తండ్రిని మాత్రమే అరెస్ట్‌ చూపించిన వైనం

ఇప్పటికీ బహిర్గతం కాని వాస్తవాలు

అధికార పార్టీ నేతల ఒత్తిడే కారణమా..?

గుడ్లూరు మండలం దారకానిపాడులో జరిగిన కాపు యువకుడు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్యోదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో పోలీసులు వ్యవహరించిన తీరే ఇందుకు కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. అధికార పార్టీ నేతల సూచనలకు అనుగుణంగా పక్కా ప్రణాళిక ప్రకారం కేసును నీరుగార్చే యత్నం జరిగిందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న మహిళలను అరెస్ట్‌ చేయకపోవడం.. నిందితుడికి అన్ని విధాలా సహకరించిన మరికొందర్ని వదిలేయడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. అయితే ఖాకీలు మాత్రం ఘటన జరిగిన వెంటనే స్పందించామని, నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపామని చెప్తూనే, కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలపడం గమనార్హం.

పోలీసుల తీరుపై అనుమానాలు 1
1/2

పోలీసుల తీరుపై అనుమానాలు

పోలీసుల తీరుపై అనుమానాలు 2
2/2

పోలీసుల తీరుపై అనుమానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement