సివిల్ సప్లయ్స్‌లో బదిలీలు
● నెల్లూరు ఏఎస్‌ఓగా వాణి
నెల్లూరు(పొగతోట): పేదల బియ్యం అక్రమ రవాణాలో కూటమి నేతల మధ్య గొడవలకు అధికారులు బలయ్యారు. పౌరసరఫరాల శాఖకు సంబంధించిన నెల్లూరు ఏఎస్‌ఓ అంకయ్యను అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు.. కావలి ఏఎస్‌ఓ రవికుమార్‌ను అన్నమయ్య జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులను ఆ శాఖ కమిషనర్ గురువారం జారీ చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న వాణిని నెల్లూరు ఏఎస్‌ఓగా నియమించారు. డీఎస్‌ఓ విజయ్‌కుమార్‌ను మాతృశాఖ రెవెన్యూ కు బదిలీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సివిల్ సప్లయ్స్ డీఎం అర్జున్‌రావును ఇన్‌చార్జి డీఎస్‌ఓగా నియమించే అవకాశం ఉందని సమాచారం.
10.2 మిల్లీమీటర్ల
వర్షపాతం నమోదు
నెల్లూరు(అర్బన్): జిల్లాలోని కొన్ని మండలాల్లో భారీ వర్షాలు గురువారం నమోదయ్యాయి. ఉదయం 8.30 నుంచి సాయంత్రం ఐదులోపు సరాసరి వర్షపాతం 10.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. పొదలకూరు మండలంలో అత్యధికంగా 66.8.. అనుమసముద్రంపేటలో అత్యల్పంగా ఒక మిల్లీమీటర్ వర్షం కురిసింది. బోగోలులో 58.4, బుచ్చిరెడ్డిపాళెంలో 40.2, చేజర్లలో 37.4, కావలిలో 29.2, కలువాయిలో 25, ఆత్మకూరులో 22.2, అల్లూరులో 15.6, వింజమూరులో 15.2, సైదాపురంలో 14.2, దగదర్తిలో 13.6, కందుకూరులో 8, కొడవలూరులో 7.4, వరికుంటపాడులో 6.2, దుత్తలూరులో 4.8, జలదంకి, సంగంలో 4.4, మర్రిపాడులో 4, ఉలవపాడులో 3.6, అనంతసాగరంలో 2.2, ఉదయగిరిలో 1.8, నెల్లూరు రూరల్, విడవలూరులో 1.2 మిల్లీమీటర్ల వర్షం పడింది.
నేటి నుంచి యథావిధిగా విద్యాసంస్థలు
నెల్లూరు రూరల్: జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, అంగన్‌వాడీ పాఠశాలలు శుక్రవారం నుంచి యథావిధిగా పనిచేయనున్నాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విషయాన్ని గమనించాలని కోరారు.
పోస్టులకు
దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు (టౌన్): పల్లిపాడులోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థలో ఉపన్యాసకుల పోస్టులకు డిప్యుటేషన్‌పై పనిచేసేందుకు ఐదేళ్ల అనుభవం కలిగిన స్కూల్ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని డీఈఓ బాలాజీరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సీనియర్ లెక్చరర్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ – 1.. లెక్చరర్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్.. 1, లెక్చరర్ ఇన్ తెలుగు.. 1, లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్.. 1.. లెక్చరర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ – 1.. లెక్చరర్ ఇన్ ఇంగ్లిష్ – 1, సీనియర్ లెక్చరర్ ఇన్ ఈవీఎస్ – 1, లెక్చరర్ ఇన్ సోషల్ స్టడీస్ – 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. నోటిఫికేషన్లో పొందుపర్చిన గూగుల్ ఫారం ద్వారా ఆన్‌లైన్లో ఈ నెల 29లోపు సమర్పించాలని కోరారు. ఆఫ్‌లైన్ అప్లికేషన్లను పల్లిపాడు డైట్ కళాశాల ప్రిన్సిపల్‌కు అందజేయాలని కోరారు. లిఖిత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఉపన్యాసకులను ఎంపిక చేయనున్నామని, వివరాలకు 94404 58428 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.


