నెల్లూరు(క్రైమ్): పేకాటాడుతూ పట్టుబడిన పోలీసులపై విచారణ నివేదిక మంగళవారం ఎస్పీ విజయారావుకు అందింది. దీంతో సదరు సిబ్బందిపై సస్పెన్షన్‌కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వివరాలు.. చెముడుగుంట నక్కలకాలనీ సమీపంలో పేకాడుతున్నారని ఆదివారం రాత్రి వెంకటాచలం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్‌స్పెక్టర్ జి.గంగాధర్ తన సిబ్బందితో కలిసి దాడి చేయగా జూదరులు కొందరు పరారయ్యారు. ఈ ఘటనలో హెడ్‌కానిస్టేబుల్ సుధాకర్, కానిస్టేబుల్స్ శ్రీనివాసులు, నందకుమార్ పట్టుబడిన విషయం విధితమే. దీనిపై నివేదిక ఇవ్వాలని నెల్లూరురూరల్ డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డిని ఆదేశించారు. దీంతో డీఎస్పీ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్ గంగాధర్ మంగళవారం నివేదికను ఎస్పీ విజయారావుకు అందజేసినట్లు తెలిసింది. ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడనున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ముగ్గురు సిబ్బందిని వారు పనిచేస్తున్న ప్రాంతాల నుంచి హెడ్‌క్వార్టర్స్‌కు పంపాలని ఆయా ప్రాంత పోలీసు అధికారులకు ఆదేశాలు అందాయి.