‘హ్యాట్సాఫ్‌ బ్రాడ్‌’

Yuvraj Singh Posts Heartwarming Message For Stuart Broad - Sakshi

యువరాజ్‌ అభినందన

ముంబై: టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని దాటిన ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌కు భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ అభినందనలు తెలిపాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో (2007 టి20 వరల్డ్‌కప్‌లో) తన చేతిలో చావు దెబ్బ తిన్న బ్రాడ్‌లా గుర్తుంచుకోకుండా... కనీసం ఇప్పుడైనా ఒక బౌలర్‌గా అతని ఘనతను గుర్తించాలని ఈ సందర్భంగా యువీ తన అభిమానులను కోరాడు. ‘నేను స్టువర్ట్‌ బ్రాడ్‌ గురించి ఎప్పుడు ఏది రాసినా జనం ఆ ఆరు సిక్సర్లనే గుర్తు చేసుకుంటారని నాకు బాగా తెలుసు.

అయితే ఇప్పుడు దాని ప్రస్తావన లేకుండా అతను సాధించిన ఘనతను అభినందించాలని నా అభిమానులను కోరుతున్నా. 500 టెస్టు వికెట్లు అంటే చిన్న విషయం కాదు. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ, అంకితభావం, పట్టుదల దీని వెనక దాగి ఉంటాయి. వెనకబడిన ప్రతీసారి పోరాటపటిమ కనపర్చి నువ్వు మళ్లీ దూసుకొచ్చావు మిత్రమా...నువ్వో దిగ్గజానికి బ్రాడ్‌... నీకు నా అభినందనలు’ అని యువరాజ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

మూడో ర్యాంక్‌కు బ్రాడ్‌...
విండీస్‌తో చివరి టెస్టులో అద్భుతంగా రాణించిన ఇంగ్లండ్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ (10/67) అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లో ఏడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌కు చేరాడు. 2016 తర్వాత తొలిసారిగా ఐసీసీ ర్యాంకుల్లో మూడో స్థానానికి చేరిన బ్రాడ్‌... ఆల్‌రౌండర్ల కేటగిరీలో 11వ ర్యాంకును అందుకున్నాడు.

మరోవైపు కరోనా కారణంగా నాలుగు నెలలుగా ఆటకు దూరమైన భారత అగ్రశ్రేణి క్రికెటర్లు (టాప్‌–10) టెస్టు ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. బ్యాట్స్‌మెన్‌ కేటగిరీలో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రెండో స్థానాన్ని... పుజరా, రహానే వరుసగా ఏడు, తొమ్మిదో ర్యాంకుల్ని కాపాడుకున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా (మూడు), రవిచంద్రన్‌ అశ్విన్‌ (ఐదు) స్థానాలు పదిలంగా ఉన్నాయి. బౌలర్ల కేటగిరీలో స్టార్‌ బౌలర్‌ బుమ్రా ఒక స్థానం పడిపోయి ఎనిమిదో ర్యాంక్‌లో నిలిచాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top