#Ishan Kishan: నేను మంచిగ ఆడినప్పుడల్లా నా క్రెడిట్‌ అతడు కొట్టేస్తాడు.. నిజానికి: ఇషాన్‌ కిషన్‌

Yeh Mera Pura Credit Le Jate: Ishan Kishan On Suryakumar innings - Sakshi

IPL 2023 PBKS Vs MI- Ishan Kishan- Suryakumar Yadav: ‘‘సామ్‌ కరన్‌ బౌలింగ్‌లో నువ్వు హిట్టింగ్‌ ఆడావు కదా! అప్పుడు నా మనసులో.. ‘‘నేను ఏ రోజైతే బాగా ఆడతానో.. అప్పుడే ఈయన కూడా తుపాన్‌ ఇన్నింగ్స్‌ ఆడతాడు. క్రెడిట్‌ మొత్తం కొట్టేయాలని చూస్తాడు. 

ఇలాంటి ఇన్నింగ్స్‌ తర్వాత.. ఇంక నా గురించి ఎవరు మాట్లాడతారు’’ అని నీ గురించి గట్టిగానే అనుకున్నా’’ అంటూ ముంబై ఇండియన్స్‌ యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌.. సూర్యకుమార్‌  యాదవ్‌తో సరదాగా వ్యాఖ్యానించాడు.

ఇద్దరూ చెలరేగారు
ఐపీఎల్‌-2023లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు ఇషాన్‌ కిషన్‌, సూర్య అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. కిషన్‌ 41 బంతుల్లో 75 పరుగులు, సూర్య 31 బంతుల్లో 66 పరుగులతో చెలరేగారు.

ఈ క్రమంలో పంజాబ్‌ విధించిన 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ముంబై వరుసగా రెండోసారి భారీ స్కోరును కాపాడుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా పలువురు కీలక సమయంలో రాణించిన ఈ ఇద్దరు బ్యాటర్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


PC: IPL Twitter

నీ వల్లే నాపై ఒత్తిడి తగ్గింది
ఇక మ్యాచ్‌ అనంతరం ఇషాన్‌, సూర్య సంభాషణకు సంబంధించిన వీడియోను ఐపీఎల్‌ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయగా వైరల్‌ అవుతోంది. ఇందులో నా క్రెడిట్‌ కొట్టేయాలని చూస్తావంటూ సూర్యను సరదాగా ఆటపట్టించిన ఇషాన్‌.. నీ వల్లే నేను ఒత్తిడి లేకుండా బ్యాటింగ్‌ చేయగలిగానంటూ కృతజ్ఞతలు చెప్పాడు.

‘‘ఆరంభం పర్వాలేదనిపించింది. కీలక సమయంలో నువ్వు క్రీజులోకి వచ్చావు. అద్భుతమైన షాట్లతో అలరించావు. నాపై ఒత్తిడి తగ్గించావు. ఈ మ్యాచ్‌లో అత్యంత సానుకూల అంశం అదే. 

నన్ను కంఫర్ట్‌ జోన్‌లో ఉంచి నువ్వు బాధ్యత తీసుకున్నావు. నీ వల్లే నేను నా సహజమైన ఆట తీరుతో పరుగులు రాబట్టగలిగాను’’ అని ఇషాన్‌ కిషన్‌.. సూర్యను కొనియాడుతూ ప్రేమను చాటుకున్నాడు. 

ఆ ఓవర్లో 6,6, 4, 4
భారీ లక్ష్య ఛేదనలో రోహిత్‌ డకౌట్‌ కాగా.. నాలుగో స్థానంలో వచ్చి ఇషాన్‌కు జతచేరిన సూర్య మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ముఖ్యంగా ముంబై ఇన్నింగ్స్‌ పదమూడో ఓవర్లో సామ్‌ కరన్‌ బౌలింగ్‌లో సూర్య వరుసగా 6,6, 4, 4 బాదాడు.

ఈ ఓవర్‌ గురించి ప్రస్తావిస్తూ ఇషాన్‌.. క్రెడిట్‌ కొట్టేస్తావని ఫిక్సైపోయా అంటూ సూర్యను సరదాగా ట్రోల్‌ చేశాడు. కాగా ఇషాన్‌ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండగా.. సూర్య 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 212 స్ట్రైక్‌రేటుతో విధ్వంసం సృష్టించాడు.

చదవండి: చిన్నప్పటి నుంచే అశ్విన్‌కు నాపై క్రష్‌! స్కూల్‌ మొత్తం తెలుసు! ఓరోజు..
Virat Kohli: ఇప్పట్లో చల్లారేలా లేదు! కోహ్లి మరో పోస్ట్‌ వైరల్‌! రియల్‌ బాస్‌ ఎవరంటే! 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top