ఒలింపిక్ పతక విజేత రవి దహియా విజ్ఞప్తి
‘క్యాట్’ను ఆశ్రయించిన ఆటగాళ్లు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడల్లో పతకం సాధించి భారతదేశం గర్వపడేలా చేసిన ఆటగాళ్లు కూడా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం అర్థించాల్సి వస్తోంది. పతకాలు గెలిచినప్పుడు వారి ప్రదర్శనను గుర్తిస్తున్నట్లుగా చెబుతూ ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వం ఏళ్లు దాటినా... దానిని రెగ్యులరైజ్ చేయకపోవడం నిజంగా చింతించాల్సిన విషయం.
ఇదే విషయంపై రెజ్లర్ రవి దహియా, పారా హైజంపర్ శరద్ కుమార్ పోరాడుతున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రవి దహియా (57 కేజీలు) రజత పతకం సాధించి సత్తా చాటగా... శరద్ కుమార్ 2020 టోక్యో పారాలింపిక్స్‌లో కాంస్యం, 2024 పారిస్ పారాలింపిక్స్‌లో రజతం సాధించాడు. తమ వేదనను తెలియజేస్తూ వీరిద్దరు వేర్వేరుగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు.
ఢిల్లీ ప్రభుత్వం పదే పదే తమ ‘తాత్కాలిక’ ఉద్యోగాన్ని పొడిగిస్తూనే ఉంది తప్ప రెగ్యులరైజ్ చేయడం లేదంటూ వీరిద్దరు ఫిర్యాదు చేశారు. తమ ఒలింపిక్ ఘనతలకుగాను ఢిల్లీ ప్రభుత్వం గ్రూప్ ‘ఎ’ ఉద్యోగాన్ని ఇచ్చిందని.. నిబంధనల ప్రకారం ఆరు నెలల పాటు తాత్కాలిక ఉద్యోగం ఇచ్చినా, ఆపై రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ తర్వాత కూడా తమను రెగ్యులరైజ్ చేయడం లేదని రవి, శరద్ ఆరోపించారు.
ప్రభుత్వ ఉద్యోగులుగా తమకు అప్పగించిన అన్ని రకాల బాధ్యతలు పూర్తి స్థాయిలో నెరవేరుస్తున్నామని రవి వెల్లడించగా... దివ్యాంగుడినైన తాను కనీస సౌకర్యాలు లేకపోయినా, ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా డ్యూటీ చేస్తున్నానని శరద్ చెప్పాడు.
ఇతర శాఖలో శాశ్వత ఉద్యోగులుగా ఉన్న తాము ఢిల్లీ ప్రభుత్వ ఆహ్వానంతో వాటిని వదిలి ఇక్కడకు వచ్చామని ప్లేయర్లు వాపోయారు. ఇప్పటికైనా స్పందించి తమను రెగ్యులరైజ్ చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు లభించే ఇతర అన్ని ప్రయోజనాలు అందేలా చూడాలని రవి, శరద్ ‘క్యాట్’ను కోరారు.
చదవండి: ‘నాపై కక్ష కట్టారు’.. శ్రేయస్ అయ్యర్ సోదరి ఆవేదన!


