రెండు జట్లకు తుది ‘టెస్టు’ | World Test Championship final from today | Sakshi
Sakshi News home page

రెండు జట్లకు తుది ‘టెస్టు’

Jun 11 2025 12:46 AM | Updated on Jun 11 2025 12:46 AM

World Test Championship final from today

నేటి నుంచి వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌

ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా ‘ఢీ’  ∙సమరోత్సాహంతో ఇరు జట్లు

మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

టెస్టు క్రికెట్‌లో అతి పెద్ద సమరానికి రంగం సిద్ధమైంది. సాంప్రదాయ ఫార్మాట్‌లో విశ్వ విజేతను తేల్చే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ పోరుకు నేడు తెర లేవనుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆ్రస్టేలియా తమ టైటిల్‌ను నిలబెట్టుకోవాలని భావిస్తుండగా... గత 27 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీని సాధించలేకపోయిన దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి రికార్డును మార్చాలని పట్టుదలగా ఉంది. వరుసగా మూడోసారి ఇంగ్లండ్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆతిథ్యం ఇస్తుండగా సౌతాంప్టన్, ఓవల్‌ తర్వాత ఈసారి వేదిక ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానానికి మారింది. 

లండన్‌: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) 2023–25 టైటిల్‌ వేటలో ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా హోరాహోరీ సమరానికి ‘సై’ అంటున్నాయి. లార్డ్స్‌ మైదానంలో నేటి నుంచి జరిగే ఫైనల్‌ పోరులో ఇరు జట్లు తలపడతాయి. 2023–25 మధ్య కాలంలో 9 జట్లు 27 సిరీస్‌లలో కలిపి మొత్తం 69 మ్యాచ్‌లలో తలపడిన అనంతరం తుది సమరానికి ఆసీస్, సఫారీ టీమ్‌ అర్హత సాధించాయి. ఇది మూడో డబ్ల్యూటీసీ ఫైనల్‌ కాగా...తొలి రెండు ట్రోఫీలను న్యూజిలాండ్, ఆ్రస్టేలియా గెలుచుకున్నాయి. రెండు సందర్భాల్లోనూ ఫైనల్‌ చేరి ఓడిన భారత్‌ ఈసారి తుది పోరుకు అర్హత పొందలేకపోయింది.  

ఆసీస్‌ అదే జోరుతో... 
ఐసీసీ ఫైనల్‌ మ్యాచ్‌లు అనగానే ఆస్ట్రేలియా ఆట ఒక్కసారిగా పతాక స్థాయికి చేరుతుందని గతంలో చాలాసార్లు రుజువైంది. ఆఖరి సమరంలో ప్రత్యర్థిపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడి మ్యాచ్‌ను తమ సొంతం చేసుకోవడంలో ఆ జట్టుకు తిరుగులేదు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 13 ఐసీసీ ఫైనల్స్‌ ఆడిన కంగారూలు 10 టైటిల్స్‌ సాధించడం వారి ఆధిపత్యాన్ని చూపిస్తోంది. 2023లో భారత్‌పై ఫైనల్‌ ఆడిన తుది జట్టులోంచి 9 మంది మళ్లీ ఇక్కడా బరిలోకి దిగడం ఖాయమైంది. 

వార్నర్‌ రిటైర్‌ కాగా, ఆల్‌రౌండర్‌ వెబ్‌స్టర్‌కు చోటు దక్కింది. గాయంతో నాటి మ్యాచ్‌కు దూరమైన హాజల్‌వుడ్‌ ఇప్పుడు బోలండ్‌ స్థానంలో ఆడతాడు. ఖ్వాజాకు జోడీగా లబుõÙన్‌ ఓపెనింగ్‌ చేయనుండగా, గ్రీన్‌ మూడో స్థానంలో ఆడతాడు. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బ్యాటర్లలో ఒకడైన స్టీవ్‌ స్మిత్, గత డబ్ల్యూటీసీ ఫైనల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హెడ్‌ బ్యాటింగ్‌లో ప్రధాన బలం కాగా, కీపర్‌ అలెక్స్‌ కేరీ కూడా చెలరేగిపోగలడు. కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్, లయన్‌లతో టీమ్‌ బౌలింగ్‌ పటిష్టంగా కనిపిస్తోంది.   

రాత మారేనా... 
దక్షిణాఫ్రికా వరుసగా గత 7 టెస్టుల్లో విజయాలు సాధించి ముందుగా ఫైనల్‌కు అర్హత సాధించినా సరే టీమ్‌పై విమర్శలు వచ్చాయి. టెస్టుల్లో అగ్రగామి అయిన ఆ్రస్టేలియా, ఇంగ్లండ్‌లాంటి టీమ్‌లతో లీగ్‌ దశలో ఒక్కసారి కూడా తలపడకుండానే జట్టు ఫైనల్‌ చేరింది. అయితే ఏ దారిలో వచ్చినా ఇప్పుడు తుది పోరులో విజేతగా నిలిచి సత్తా చాటాలని సఫారీలు భావిస్తున్నారు. అయితే జట్టులో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోంది. 

మార్క్‌రమ్, కెపె్టన్‌ తెంబా బవుమాలకు మాత్రమే ప్రస్తుత ఆసీస్‌ బౌలర్లను ఎదుర్కొన్న అనుభవం ఉంది. రికెల్టన్, ముల్డర్, స్టబ్స్, బెడింగ్‌హామ్‌ ఇంకా టెస్టు కెరీర్‌ ఆరంభ దశలోనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సఫారీ టాప్‌–7 బ్యాటర్లందరి టెస్టు పరుగులు కలిపినా (9,873)... ఒక్క స్మిత్‌ (10,271) పరుగులకంటే తక్కువే ఉన్నాయి! 

అయితే వైవిధ్యమైన బౌలింగ్‌ తో ఆసీస్‌ను కట్టడి చేయగలమని నమ్ముతోంది. ఇంగ్లండ్‌లో వాతావరణం అనుకూలిస్తే తన స్వింగ్‌తో రబాడ ప్రమాదకరమైన బౌలర్‌ కాగా, యాన్సెన్‌ లెఫ్టార్మ్‌ పేస్‌ కూడా ఇటీవల పదునెక్కింది. ఇక స్పిన్‌ కోసం మరోసారి దక్షిణాఫ్రికా మహరాజ్‌నే నమ్ముకుంది.

పిచ్, వాతావరణం
సాధారణ బ్యాటింగ్‌ పిచ్‌. ప్రస్తుతం ఉపఖండం తరహాలోనే వాతావరణం ఉంది. మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. వర్షంతో అంతరాయం కలగవచ్చు. అయితే ఐదు రోజులలో నిర్ణీత ఓవర్లు పూర్తి కాకుండా ఫలితం రాకపోతే ‘రిజర్వ్‌ డే’ ఆరో రోజుకు మ్యాచ్‌ సాగుతుంది. భారత్, కివీస్‌ మధ్య 2021 ఫైనల్లో ఇదే జరిగింది.

తుది జట్లు (అంచనా)
ఆస్ట్రేలియా: కమిన్స్‌ (కెప్టెన్‌), ఖ్వాజా, లబుషేన్, గ్రీన్, స్మిత్, హెడ్, వెబ్‌స్టర్, కేరీ, స్టార్క్, లయన్, హాజల్‌వుడ్‌. 
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్‌), మార్క్‌రమ్, రికెల్టన్, ముల్డర్, స్టబ్స్, బెడింగ్‌హామ్, వెరీన్, యాన్సెన్, కేశవ్‌ మహరాజ్, రబాడ, ఇన్‌గిడి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement