
సమర్‌కండ్ (ఉజ్బెకిస్తాన్): అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) గ్రాండ్ స్విస్ టోర్నీలో సోమవారం సంచలనం చోటు చేసుకుంది. ఐదో రౌండ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది. భారత సంతతికి చెందిన అమెరికా గ్రాండ్‌మాస్టర్, 16 ఏళ్ల అభిమన్యు మిశ్రా 61 ఎత్తుల్లో గుకేశ్‌ను ఓడించాడు.
మరో గేమ్‌లో టాప్ సీడ్, భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద 55 ఎత్తుల్లో మథియాస్ బ్లూబామ్ (జర్మనీ) చేతిలో ఓటమి పాలయ్యాడు. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 37 ఎత్తుల్లో నికిత వితియుగోవ్ (ఇంగ్లండ్)పై గెలుపొందాడు. ఈ టోర్నీలో మూడు గేముల్లో నెగ్గి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న అర్జున్ మరో ముగ్గురితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నాడు.