సరిలేరు ఆమెకెవ్వరు... | Women Sports Stars Waving the Indian Flag Internationally | Sakshi
Sakshi News home page

సరిలేరు ఆమెకెవ్వరు...

Mar 8 2021 5:11 AM | Updated on Mar 8 2021 5:14 AM

Women Sports Stars Waving the Indian Flag Internationally - Sakshi

ఆమె గరిటె తిప్పితే.... కడుపు నిండుతుంది. ఆమె పాట పాడితే... మనసు పరవశిస్తుంది. ‘ఆమె’ ఆట ఆడితే... విజయమే బానిసవుతుంది. పతకం మురిసిపోతుంది. యావత్‌ దేశం గర్వపడేలా చేస్తుంది. ఆమె ఇప్పుడు ఆకాశంలోనే సగం కాదు... ఆటల్లోనూ ఘనం. క్రీడా సమరంలో క్రియాశీలం. ఇంకా చెప్పాలంటే ఒలింపిక్స్‌లాంటి ప్రతిష్టాత్మక పోటీల్లో ఈ వీరనారిత్వమే పతకాలను తెచ్చిపెడుతోంది. వ్యక్తిగత క్రీడల్లో 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టర్, తెలుగుతేజం కరణం మల్లీశ్వరి త్రివర్ణ శోభితం చేస్తే... 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో షట్లర్‌ సైనా నెహ్వాల్, బాక్సర్‌ మేరీకోమ్‌... 2016 రియో ఒలింపిక్స్‌లో షట్లర్‌ పీవీ సింధు, రెజ్లర్‌ సాక్షి మలిక్‌లే పతకాలు, శతకోటి భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చారు.

ఇప్పుడు అదే ఉత్సాహంతో, అంతే కదన కుతూహలంతో ‘టోక్యో’ వెళ్లేందుకు కష్టపడుతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా 2021 టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆశల పల్ల్లకిని మోయనున్న షట్లర్‌ సింధు, బాక్సర్లు మేరీకోమ్, సిమ్రన్‌జిత్, పూజా రాణి, లవ్లీనా, ఆర్చర్‌ దీపిక కుమారి, రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్, మహిళా షూటర్లు మనూ భాకర్, రాహీ సర్నోబత్, ఇలవేనిల్‌ వలారివన్, అంజుమ్‌ మౌద్గిల్, అపూర్వీ చండేలా, తేజస్విని సావంత్, యశస్విని సింగ్, చింకీ యాదవ్, అథ్లెట్స్‌ భావన, ప్రియాంక గోస్వామి, రాణి రాంపాల్‌ నాయకత్వంలోని భారత హాకీ జట్టు సభ్యులకు మనసారా కంగ్రాట్స్‌ చెబుదాం. విమెన్‌ ఇండియా... విన్‌ ఇండియా.  

కేవలం ఒలింపిక్‌ క్రీడాంశాల్లోనే కాకుండా నాన్‌ ఒలింపిక్‌ క్రీడల్లోనూ భారత మహిళా క్రీడా కారిణులు మెరిసిపోతున్నారు. గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ మేధోసంపదతో రెండు దశాబ్దాలుగా ప్రపంచ చెస్‌లో భారత్‌ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. పదిహేను నెలల క్రితం ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్‌షిప్‌లో హంపి స్వర్ణ పతకాన్ని గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. బీబీసీ మీడియా సంస్థ అందించే ‘ఈ ఏడాది అత్యుత్తమ భారతీయ క్రీడాకారిణి’ అవార్డు రేసులో రాణి రాంపాల్‌ (హాకీ), వినేశ్‌ (రెజ్లర్‌), మనూ భాకర్‌ (షూటింగ్‌), ద్యుతీ చంద్‌ (అథ్లెటిక్స్‌)లతో కలిసి హంపి బరిలో నిలిచింది. మహిళా దినోత్సవం సందర్భంగా బీబీసీ సంస్థ ఈరోజు విజేతను ప్రకటించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement