
ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. 33 ఏళ్ల జంపా పొట్టి ఫార్మాట్‌లో ఆసీస్ తరఫున 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో ఆసీస్ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. జంపాకు ముందు గ్లెన్ మ్యాక్స్‌వెల్ (121), డేవిడ్ వార్నర్ (110), ఆరోన్ ఫించ్ (103) మాత్రమే ఈ ఘనత సాధించారు.
ఇవాళ (జులై 29) వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20 జంపా కెరీర్‌లో 100వ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో జంపా ఓ మోస్తరుగా (3-0-20-1) రాణించి ఆసీస్ విజయంలో తనవంతు పాత్రను పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొంది, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 5-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. డ్వార్షుయిస్ (4-0-41-3), నాథన్ ఇల్లిస్ (3.4-0-32-2), ఆరోన్ హార్డీ (4-0-39-1), సీన్ అబాట్ (4-0-30-1), మ్యాక్స్‌వెల్ (1-0-6-1), జంపా (3-0-20-1) ధాటికి 19.4 ఓవరల్లో 170 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో షిమ్రోన్ హెట్‌మైర్ (52) అర్ద సెంచరీతో రాణించగా.. రూథర్‌ఫోర్డ్ (35) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. కెమరూన్ గ్రీన్ (32), టిమ్ డేవిడ్ (30), మిచెల్ ఓవెన్ (37), ఆరోన్ హార్డీ (28 నాటౌట్) తలో చేయి వేయడంతో 17 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది (7 వికెట్లు కోల్పోయి). విండీస్ బౌలర్లలో అకీల్ హోసేన్ 3, జేసన్ హోల్డర్, అల్జరీ జోసఫ్ తలో 2 వికెట్లు తీశారు.
కాగా, ఈ సిరీస్‌కు ముందు విండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను కూడా ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. తద్వారా భారత్ తర్వాత ఓ పర్యటనలో వరుసగా 8 మ్యాచ్‌లు (3 టెస్ట్‌లు, 5 టీ20లు) గెలిచిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. భారత్ 2017 శ్రీలంక పర్యటనలో వరుసగా 9 మ్యాచ్‌ల్లో గెలిచింది.
విండీస్‌తో టీ20 సిరీస్‌ను వైట్ వాష్ చేయడంతో ఆసీస్ మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టెస్ట్ హోదా కలిగిన జట్టును క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది.