
యశస్వి జైస్వాల్ (PC: ipl.com)
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు బ్యాట్ ఝులిపించలేదు. కనీస స్థాయి ప్రదర్శన చేయలేక చతికిలపడ్డాడు. కాగా గత సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 625 పరుగులు సాధించిన ఈ లెఫ్టాండర్.. టీమిండియాలో ఎంట్రీ ఇచ్చి దుమ్ములేపాడు.
టెస్టు, టీ20లలో భారత ఓపెనర్‌గా సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌లో యశస్వి జైస్వాల్‌పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. కానీ.. అందుకు తగ్గట్లుగా ఈ రాజస్తాన్ రాయల్స్ స్టార్ రాణించలేకపోతున్నాడు.
తాజా సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి యశస్వి జైస్వాల్ కేవలం 39 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు సాధించిన అత్యధిక స్కోరు 24. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో అయితే పరుగుల ఖాతా తెరవకుండానే అతడు వెనుదిరిగాడు.
ఈసారి పరుగుల ఖాతా కూడా తెరవలేదు
జైపూర్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో రెండు బంతులు ఎదుర్కొని జైస్వాల్ డకౌట్ అయ్యాడు. రీస్ టోప్లీ బౌలింగ్లో మాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, మరో ఓపెనర్ జోస్ బట్లర్ అజేయ శతకం(100)తో రాజస్తాన్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు.
4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷
— IndianPremierLeague (@IPL) April 6, 2024
And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪
Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN
సంజూ శాంసన్(69) సైతం మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి రాజస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా రాజస్తాన్ ఖాతాలో వరుసగా నాలుగో గెలుపు చేరింది. ఇక ఇలా జట్టు ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో గెలుపొందింది కాబట్టి జైస్వాల్ వైఫల్యం పెద్దగా లెక్కలోకి రాలేదు.
నిజానికి ఏ ఒక్క మ్యాచ్‌లో ఫలితం తారుమారైనా వేళ్లన్నీ జైస్వాల్ వైపు చూపేవనడంలో సందేహం లేదు. ఏదేమైనా.. ఒంటిచేత్తో జట్టును గెలిపించే సత్తా ఉన్న ఆటగాడైన ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇలా విఫలం కావడం విమర్శలకు తావిస్తోంది.
అసలు నువ్వేం చేస్తున్నావు యశస్వి?
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రతిసారీ లెఫ్టార్మ్ పేసర్ల చేతిలో అవుట్ అవుతున్న జైస్వాల్ ఇప్పటికైనా బలహీనతలు అధిగమించేందుకు కృషి చేయాలని సూచించాడు.
‘‘యశస్వి జైస్వాల్ మళ్లీ స్కోరు చేయలేకపోయాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌లో మూడింటిలో లెఫ్టార్మ్ పేసర్ల చేతికే చిక్కాడు. అసలు నువ్వేం చేస్తున్నావు యశస్వి?
దయచేసి పట్టుదలగా నిలబడి బ్యాటింగ్ చెయ్యి.. కొన్ని పరుగులు సాధించు. నిజానికి నువ్వు మంచి ఆటగాడివి’’ అంటూ జైస్వాల్ ఆట తీరును ఆకాశ్ చోప్రా విమర్శించాడు. ఇప్పటికైనా తిరిగి పుంజుకుంటే వరల్డ్‌కప్ జట్టులో పోటీ లేకుండా బెర్తు ఖరారు చేసుకోవచ్చని సూచించాడు.
చెత్త బ్యాటర్ అయిపోడు
ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్‌కు రాజస్తాన్ రాయల్స్ కోచ్ కుమార్ సంగక్కర అండగా నిలిచాడు. ఫ్రాంఛైజీ క్రికెట్‌తో పాటు టీమిండియా తరఫున కూడా అదరగొట్టిన యశస్వి.. రెండు ఇన్నింగ్స్‌లో విఫలమైనంత మాత్రాన చెత్త బ్యాటర్ ఏమీ అయిపోడని వెనకేసుకువచ్చాడు. అతడి నైపుణ్యాలేమిటో తమకు తెలుసునని.. కచ్చితంగా కమ్‌బ్యాక్ ఇస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.
చదవండి: Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు