ప్రతిభను వెలికితీస్తాం 

We Will Encourage New Talent Says Neetu David - Sakshi

మహిళల క్రికెట్‌ చీఫ్‌ సెలక్టర్‌ నీతూ డేవిడ్‌ వ్యాఖ్య  

న్యూఢిల్లీ: యువ ప్రతిభను వెలికితీయడమే తమ ప్యానెల్‌ లక్ష్యమని భారత మహిళల క్రికెట్‌ చీఫ్‌ సెలక్టర్‌ నీతూ డేవిడ్‌ అన్నారు. 16 ఏళ్ల వయస్సులోనే సత్తా చాటుతోన్న భారత క్రికెటర్‌ షఫాలీ వర్మలాంటి ప్లేయర్లను ప్రోత్సహిస్తామని ఆమె చెప్పారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం అన్ని స్థాయిల క్రికెట్‌లో హిట్టింగ్, ఆట వేగం పెరిగిపోయిందని విశ్లేషించారు. యువ సత్తాతో పాటు అనుభవజ్ఞులు కూడిన జట్టుతో అద్భుతాలు చేయొచ్చని ఆమె వివరించారు. ‘ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లో కూడా వేగం చాలా పెరిగింది.

గతంలో ఇలా ఉండేది కాదు. ప్లేయర్లు దూకుడుగా ఆడుతున్నారు. వారి ఆలోచనా విధానం మారింది. అందుకు తగినట్లే షఫాలీలా ఆడే వారు కావాలి. మన దగ్గర చాలా మంది యువ ప్రతిభావంతులు ఉన్నారు. తగిన సమయంలో వారికి అవకాశాలు కల్పించాలి. వారితో పాటు మిథాలీ రాజ్, జులన్‌ గోస్వామి అనుభవజ్ఞులు ఉంటేనే జట్టుకు సమతూకం వస్తుంది. వారు మెరుగ్గా ఆడినంత కాలం రిటైర్మెంట్‌ గురించి ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో వారికి బాగా తెలుసు’ అని ఆమె చెప్పుకొచ్చారు. మెగా టోర్నీల్లో తుదిపోరులో జట్టు వైఫల్యంపై దృష్టిసారిస్తామన్న ఆమె భారత్‌ ప్రపంచకప్‌ సాధించడమే అంతిమ లక్ష్యమని వ్యాఖ్యానించింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top