రిషభ్ పంత్ (PC: BCCI/IPL)
లక్నో సూపర్ జెయింట్స్ రాత మారలేదు. ముంబై ఇండియన్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో పరాజయం పాలైంది. తద్వారా ఐపీఎల్-2026లో వరుసగా ఆరో (డబుల్ హ్యాట్రిక్) ఓటమి నమోదు చేసింది. తద్వారా పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది.
మా వాళ్లు స్వేచ్ఛగా ఆడారు
ఈ నేపథ్యంలో ముంబై చేతిలో ఓటమిపై లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘మేము శుభారంభం అందుకున్నాం. అయితే, అదే ఆట తీరు కొనసాగించి మరికొన్ని పరుగులు రాబడితే ఇంకా బాగుండేది. ఈ మ్యాచ్‌లో మాకూ సానుకూలాంశాలు ఉన్నాయి.
కానీ అవేంటో ఇప్పుడు చెప్పలేను. మా వాళ్లు స్వేచ్ఛగా ఆడారు. అయితే, ఆఖర్లో ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. సొంతమైదానం కాబట్టి ఇక్కడి పిచ్ పరిస్థితులకు వాళ్లు బాగా అలవాటు పడ్డారు. ముందుగా చెప్పినట్లు మేము ఇంకో 10-15 పరుగులు చేసి ఉంటే బాగుండేది.
వారిని తప్పుపట్టలేను
ఈ వికెట్ మీద 220-230 పరుగులు చేయడం కాస్త సులువే. ఆరంభంలో మాదే పైచేయిగా ఉంది. బౌలర్లను ఓటమికి బాధ్యులను చేయలేను. వారిని తప్పుపట్టలేను. మా బౌలర్లు అత్యద్భుతంగా బౌల్ చేశారు’’ అని పంత్ పేర్కొన్నాడు.
అదృష్టం కావాలయ్యా!
ఈ క్రమంలో..‘బాగానే ఆడుతున్నారు. అయినా ఓడిపోతున్నారు. మీ జట్టుకు ఇంకేం కావాలి?’ అని హోస్ట్ అడుగగా.. ‘‘మాకు కొంచెం అదృష్టం కావాలయ్యా!.. అదొక్కటే నేను ఇప్పుడు చెప్పగలను’’ అని పంత్ సమాధానం ఇచ్చాడు.
‘ఎలాంటి అదృష్టం?’ అని హోస్ట్ ప్రశ్నించగా.. ‘‘మాకు ఆశీర్వాదాలు కావాలి. మేము ఇంకాస్త పట్టుదలగా ముందుకు సాగాలి’’ అని పంత్ బదులిచ్చాడు.
పూరన్ బ్యాట్ ఝులిపించినా..
కాగా వాంఖడే వేదికగా టాస్ ఓడిన లక్నో తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు సాధించింది. నికోలస్ పూరన్ విధ్వంసకర అర్ధ శతకం (21 బంతుల్లో 63)తో మెరవగా.. మార్క్రమ్ (31 నాటౌట్), హిమ్మత్ సింగ్ (40 నాటౌట్) తమ వంతు సాయం అందించారు. ఇక పంత్ 15 పరుగులే చేశాడు.
High, Handsome and 2⃣ points 💙@mipaltan seal their highest run-chase in #TATAIPL history ✌️
Scorecard ▶️ https://t.co/elXSOvaeig #KhelBindaas | #MIvLSG pic.twitter.com/G5rSddXCbc— IndianPremierLeague (@IPL) May 4, 2026
అయితే, ముంబై ఓపెనర్లు రియాన్ రికెల్టన్ (32 బంతుల్లో 83), రోహిత్ శర్మ (44 బంతుల్లో 84) ఆకాశమే హద్దుగా చెలరేగి లక్నోకు షాకిచ్చారు. వీరిద్దరితో పాటు నమన్ ధిర్ (12 బంతుల్లో 23 నాటౌట్) మెరుపులు మెరిపించగా.. 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి ముంబై లక్ష్యాన్ని ఛేదించింది. లక్నోను ఆరు వికెట్ల తేడాతో ఓడించి.. వాంఖడేలో ఈ సీజన్‌లోవరుసగా నాలుగు ఓటముల తర్వాత తొలి విజయం నమోదు చేసింది.


