నువ్వసలు ఏం చేశావు బుమ్రా?.. గావస్కర్‌ ఫైర్‌! | Unacceptable: Gavaskar Blasts Bumrah For Big Error Against LSG | Sakshi
Sakshi News home page

నువ్వసలు ఏం చేశావు బుమ్రా?.. గావస్కర్‌ ఫైర్‌!

May 5 2026 8:34 AM | Updated on May 5 2026 8:57 AM

Unacceptable: Gavaskar Blasts Bumrah For Big Error Against LSG

టీమిండియా ప్రధాన పేసర్‌, ముంబై ఇండియన్స్‌ స్టార్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఆట తీరుపై భారత దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బుమ్రా వంటి ప్రపంచస్థాయి బౌలర్‌ ‘ఇలాంటి’ తప్పు చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదన్నాడు. ఇంతకీ బూమ్‌ బూమ్‌ బుమ్రా ఏం చేశాడంటే?..

ఐపీఎల్‌-2026లో ఏడు ఓటములతో దాదాపుగా ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలు కోల్పోయిన దశలో ముంబై ఇండియన్స్‌ ఎట్టకేలకు సొంతగడ్డపై చెలరేగిన సంగతి తెలిసిందే. వాంఖడే వేదికగా ముంబై సోమవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడింది. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఆతిథ్య జట్టు లక్నోను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

చెలరేగిన నికోలస్‌ పూరన్‌
ఎట్టకేలకు నికోలస్‌ పూరన్‌ (21 బంతుల్లో 63) చెలరేగడంతో లక్నో భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. మిగతా వారిలో ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (44), ఐడెన్‌ మార్క్రమ్‌ (31 నాటౌట్‌), హిమ్మత్‌ సింగ్‌ (40 నాటౌట్‌) రాణించారు.

రెండు నో బాల్స్‌
ఇదిలా ఉంటే.. లక్నో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న వేళ బుమ్రా (Jasprit Bumrah) పద్నాలుగో ఓవర్లో బంతితో రంగంలోకి దిగాడు. బుమ్రా బౌలింగ్‌లో తొలి బంతికి మార్క్రమ్‌ సింగిల్‌ తీయగా.. రెండో బంతికి పరుగులేమీ రాలేదు.

ఇక మూడో బంతికి హిమ్మత్‌ సింగ్‌కు సంధించగా.. అది నో బాల్‌ అయింది. ఆ తర్వాత బంతి వైడ్‌గా వెళ్లింది. ఆ వెంటనే బుమ్రా మళ్లీ నో బాల్‌ వేశాడు. ఈ ఓవర్లో బుమ్రా మొత్తంగా ఏడు పరుగులే ఇచ్చినప్పటికీ రెండు నోబాల్స్‌ వేయడం విమర్శలకు దారితీసింది.

గావస్కర్‌ ఫైర్‌
ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ సునిల్‌ గావస్కర్‌ బుమ్రా ఆట తీరుపై మండిపడ్డాడు. ‘‘ఇది అస్సలు ఆమోదయోగ్యనీయం కాదు. నువ్వొక ప్రొఫెషనల్‌ క్రికెటర్‌వి బుమ్రా. వైడ్‌లు వేస్తున్నావంటే అర్థం చేసుకోగలను. కానీ నో బాల్స్‌ వేయడమేంటి?’’ అని కామెంట్రీ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కాగా ఈ మ్యాచ్‌లో బుమ్రా చెత్త ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి ఏకంగా 45 పరుగులు ఇచ్చుకున్నాడు. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు.

ఎట్టకేలకు ఓ విజయం
ఇక ముంబై ఓపెనర్లు రోహిత్‌ శర్మ (84), రికెల్టన్‌ (83) చెలరేగడంతో లక్నో విధించిన 229 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఆరు వికెట్లతో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై గెలిచింది. వరుసగా మూడు ఓటముల తర్వాత ముంబైకి ఈ కీలక విజయం దక్కింది. మరోవైపు లక్నో వరుస ఓటముల్లో ‘సిక్సర్‌’ నమోదు చేసింది. వరుసగా ఆరో పరాజయంతో జట్టు అట్టడుగున పదో స్థానంలోనే ఉంది. 

చదవండి: మాట త‌ప్పిన రిషబ్‌ పంత్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement