పంత్ బంతి ఎక్కడుంది.. ఎటు పరిగెడుతున్నావు

Watch Rishabh Pant Runs In Wrong Direction As Ball Flies Over His Head - Sakshi

చెన్నై: రిషబ్‌ పంత్‌ ఎక్కడ ఉంటే అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదువ ఉండదు. ఆసీస్‌తో చారిత్రక సిరీస్‌ విజయంతో మంచి జోష్‌లో కనిపిస్తున్న పంత్‌ అదే ఉత్సాహాన్ని ఇంగ్లండ్‌తో టెస్టులోనూ కంటిన్యూ చేస్తున్నాడు. తొలి టెస్టులో మొదటిరోజు ఆటలో సుందర్‌ను ట్రోల్‌ చేసిన విషయం అందరికి తెలిసిందే. అంతేగాక తొలిరోజు వికెట్ల వెనకాల నిలబడి బౌలర్లను ఎంకరేజ్‌ చేస్తూ వారిని ఉత్సాహపరిచాడు. రెండు రోజుల నుంచి వికెట్లు తీయలేక.. ఇటు పరుగుల ఆపలేక నానా అవస్థలు పడుతున్న టీమిండియా ఆటగాళ్లకు పంత్‌ తన చర్యలతో కాస్త ఉపశమనం కలిగిస్తున్నాడు.

తాజాగా పంత్‌ చేసిన పని నవ్వు తెప్పిస్తూనే క్యాచ్‌ను వదిలేయడం కాస్త బాధ కలిగించింది. అసలు విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 151వ ఓవర్‌ను రవిచంద్రన్‌ అశ్విన్‌ వేశాడు. జో రూట్‌, ఓలీ పోప్‌లు క్రీజులో ఉన్నారు. అశ్విన్‌ వేసిన ఓవర్‌ మూడో బంతి ఫుల్‌టాస్‌ అయి పోప్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకుతూ  గాల్లోకి లేచింది. అయితే బంతి దిశను గమనించని పంత్‌ క్యాచ్‌ కోసం వ్యతిరేక దిశలలో పరుగు పెట్టాడు.. అయోమయంలో ఉన్న పంత్‌ వెనుకకు తిరిగి చూసేసరికి అప్పటికే వెనుకవైపు పడింది. దీంతో లెగ్‌స్క్వేర్‌లో ఉన్న రోహిత్‌ బంతి కోసం పరిగెత్తగా అ‍ప్పటికే రూట్‌, పోప్‌లు రెండు పరుగులు పూర్తి చేశారు.

ఈ చర్యతో టీమిండియా ఆటగాళ్లు మొదట ఆశ్చర్యపోయినా.. పంత్‌ చేసిన పని నవ్వు తెప్పించింది.వాస్తవానికి కాస్త కష్టతరమైనా బంతి దిశను గమనించి ఉంటే పంత్‌ క్యాచ్‌ను అందుకునేవాడు. కాగా  తొలిరోజు ఆటలో బుమ్రా బౌలింగ్‌లో రోరీ బర్న్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను పంత్‌ వదిలేయడం గమనార్హం. కాగా ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తమదైశ శైలిలో స్పందిస్తున్నారు. 'పాపం పంత్‌.. కన్ప్యూజ్‌ అయినట్లున్నాడు.. బంతి ఒకవైపు.. పంత్‌ మరోవైపు.. పంత్‌ ముందు బంతి దిశను గమనించి పరిగెత్తు బాబు..'అంటూ కామెంట్స్‌తో ఆడుకున్నారు. 

ఇక మ్యాచ్‌​ విషయానికి వస్తే ఇంగ్లండ్‌ భారీ స్కోరు చేసింది. ఇప్పటివరకు 178 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 549 పరుగులు సాధించింది. రూట్‌ డబుల్‌ సెంచరీతో మెరవగా.. స్టోక్స్‌ 82 పరుగులతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం డొమినిక్‌ బెస్‌ 28 పరుగులు, జాక్‌ లీచ్‌ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో రోజు ఆటకు ఇంకా అరగంటే సమయం ఉండడంతో చివరి ఓవర్‌లో ఇంగ్లండ్‌ తన ఇ‍న్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసే అవకాశం ఉంది. ఇక టీమిండియా మూడోరోజు ఎలా ఆడుతుందనే దానిపై మ్యాచ్‌ ఫలితం ఆధారపడి ఉంది.

చదవండి: 
నిన్న హెల్మెట్‌తో ఫీల్డింగ్‌.. ఇవాళ భజ్జీలా బౌలింగ్‌
అంతా బయటివాళ్లే... మనోళ్లు ఒక్కరు లేరు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top