కత్తిదూస్తే రాణిరుద్రమలే! | warangal girls shine in fencing | Sakshi
Sakshi News home page

కత్తిదూస్తే రాణిరుద్రమలే!

Apr 13 2026 11:57 AM | Updated on Apr 13 2026 12:41 PM

warangal girls shine in fencing

వరంగల్‌ స్పోర్ట్స్‌: రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి. వారి తెగువ, ఆయుధ విద్యను ఇప్పటికీ ఓరుగల్లు ఆడబిడ్డలు వారసత్వంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కత్తిసాము(ఫెన్సింగ్‌) క్రీడ ఉనికి పదిలంగానే ఉంది. ప్రపంచ ప్రఖ్యాత క్రీడల్లో ఫెన్సింగ్‌ మూడో స్థానంలో నిలుస్తోంది. అభివృద్ది చెందిన నగరాలు, దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ గేమ్‌లో రాణిస్తున్నారు ఉమ్మడి వరంగల్‌కు చెందిన ఆడబిడ్డలు. రాణి రుద్రమదేవీలా కత్తి దూస్తున్న ఆ ఇద్దరి నేపథ్యమే ఈ వారం ‘సాక్షి’ స్పెషల్‌ స్టోరీ.

అంతర్జాతీయ వేదికపై ప్రదర్శన
వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటకు చెందిన గొర్రె శ్రీజ డిగ్రీ చదువుతూ మహారాష్ట్ర సాయ్‌ అకాడమీలో ఫెన్సింగ్‌లో శిక్షణ పొందుతోంది. 4వ తరగతిలో హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో చేరిన శ్రీజ 9వ తరగతి వరకు అక్కడే చదువుతూ ఫెన్సింగ్‌లో శిక్షణ పొందింది. అనంతరం ఎన్‌ఐఎస్‌ పంజాబ్‌లో సీటు సాధించి కత్తి యుద్ధంలో ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇప్పటి వరకు 20కిపైగా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో బల్గేరియా, ఇటలీలో జరిగిన చాంపియన్‌షిప్‌లో తనదైన ప్రతిభ చాటింది. ఎప్పటికై నా భారత్‌ తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొని పతకం సాధించడమే తన లక్ష్యమని శ్రీజ చెబుతోంది.

పది పోటీల్లో ప్రతిభ
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన కడార్ల స్కావెస్లా స్పోర్ట్స్‌ కోటాలో ఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతోంది. పదో తరగతిలో ఫెన్సింగ్‌లో శిక్షణ ప్రారంభించిన స్కావెస్లా కేవలం ఐదేళ్లలో పదికి పైగా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. మరింత మెరుగైన శిక్షణ అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి వరంగల్‌ జిల్లాకు పేరు తీసుకొస్తానని స్కావెస్లా చెబుతోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement