టెస్ట్‌ల్లోకి కోహ్లి రీఎంట్రీ..? క్లూ ఇచ్చిన కీలక వ్యక్తి | Virat Kohli Set To Play Test Cricket Again? Childhood Coach Gives Major Comeback Hint | Sakshi
Sakshi News home page

టెస్ట్‌ల్లోకి కోహ్లి రీఎంట్రీ..? క్లూ ఇచ్చిన కీలక వ్యక్తి

May 21 2026 12:01 PM | Updated on May 21 2026 12:09 PM

Virat Kohli Set To Play Test Cricket Again? Childhood Coach Gives Major Comeback Hint

టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి టెస్ట్‌ క్రికెట్‌ రీఎంట్రీ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విరాట్‌ సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి ఏడాది దాటిపోయినా.. అభిమానుల్లో మాత్రం ఇంకా అతన్ని వైట్‌ డ్రెస్‌లో చూడాలనే ఆశ కనిపిస్తూనే ఉంది. తాజాగా విరాట్‌ చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు కోహ్లి టెస్ట్‌ క్రికెట్‌ రీఎంట్రీపై చర్చకు మరింత ఊతమిచ్చాయి.

రాజ్‌కుమార్‌ శర్మ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలామంది విరాట్‌ మళ్లీ టెస్ట్‌ క్రికెట్‌లోకి రావాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో నేనే అతన్ని ఒప్పించగలనని వారి నమ్మకం. వారు కోరుకున్న విధంగానే ఈ విషయాన్ని విరాట్‌ వద్ద ప్రస్తావించాను. చర్చలు  కూడా జరుగుతున్నాయి. ఏమవుతుందో చూద్దామని అన్నాడు. 

ఈ వ్యాఖ్యలతో అభిమానులు విరాట్‌ కంబ్యాక్‌పై ఆశలు పెంచుకున్నారు. కొందరైతే "కింగ్‌ ఈజ్‌ కమింగ్‌ బ్యాక్‌" అంటూ సోషల్‌మీడియాలో హడావుడి మొదలు పెట్టారు.

ఇదిలా ఉంటే, ఇటీవల కొన్ని సందర్భాల్లో విరాట్‌ తన టెస్ట్‌ పునరాగమనంపై పరోక్ష సంకేతాలు ఇచ్చాడు. పరస్పర నమ్మకం, గౌరవం, విలువ తగ్గిన వాతావరణంలో కొనసాగాలని తనకు ఆసక్తి లేదని చెప్పకనే చెప్పాడు. వీటిని బట్టి చూస్తే విరాట్‌ టెస్ట్‌ కంబ్యాక్‌ అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి.

2025 మే 12న టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విరాట్‌.. 123 టెస్ట్‌ల్లో 9230 పరుగులు చేశాడు. విదేశీ గడ్డపై భారత జట్టును దూకుడుగా నడిపించిన నాయకుడిగా, ఆధునిక యుగంలో అత్యుత్తమ టెస్ట్‌ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. అయితే అతని రిటైర్మెంట్‌ నిర్ణయం అప్పట్లో అభిమానులతో పాటు క్రికెట్‌ ప్రపంచాన్నే షాక్‌కు గురిచేసింది.

టెస్ట్‌ క్రికెట్‌లో కోహ్లీ సాధించిన విజయాలు భారత క్రికెట్‌ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. 2011లో టెస్ట్‌ అరంగేట్రం చేసిన అతడు.. కొద్ది కాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. అనంతరం కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి భారత జట్టును ప్రపంచ నంబర్‌ వన్‌గా నిలబెట్టాడు. కెప్టెన్‌గా 68 టెస్టుల్లో భారత జట్టును నడిపించిన కోహ్లీ.. 40 విజయాలు అందించి దేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన టెస్ట్‌ కెప్టెన్‌గా నిలిచాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement