వైరలవుతున్న కోహ్లి బర్త్‌డే వేడుకలు

Virat Kohli Cuts Cake With Anushka Sharma Goes Viral In Social Media - Sakshi

దుబాయ్‌ : విరాట్‌ కోహ్లి.. క్రికెట్‌ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. టీమిండియా కెప్టెన్‌గా సేవలందిస్తున్న విరాట్‌ కోహ్లి నేడు 32వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే బ్యాట్స్‌మెన్‌గా అనితరసాధ్యమైన రికార్డులు సాధించిన కోహ్లి కెప్టెన్‌గాను విజయవంతమైన బాటలో నడుస్తున్నాడు. ఈ సందర్భంగా ఐపీఎల్‌ 13వ సీజన్లో భాగంగా యూఏఈలో ఉన్న కోహ్లి భార్య అనుష్క శర్మతో కలిసి బుధవారం ఆర్‌సీబీ టీమ్‌ సభ్యుల సమక్షంలో కేక్‌ను కట్‌ చేశాడు.

అందుకు సంబంధించిన వీడియోను కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.  కోహ్లి భార్య అనుష్క ప్రెగ్నెంట్‌ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వచ్చే జనవరిలో తమ ఇంట్లోకి మూడో వ్యక్తి ప్రవేశించబోతున్నట్లు విరుష్కలు ఇప్పటికే తెలిపారు. కాగా ఆర్‌సీబీకి మొదటిసారి ఐపీఎల్‌ టైటిల్‌ సాధించిపెట్టాలనే కసితో ఉన్న కోహ్లికి ఆ కోరిక నెరవేరడానికి మూడు అడుగుల దూరంలో ఉన్నాడు. శుక్రవారం సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచేందుకు ఆర్‌సీబీ సంసిద్ధం అవుతుంది. (చదవండి : ‘బుట్టబొమ్మ’కు ఆడిపాడిన వార్నర్‌ సేన)


విరాట్‌ కోహ్లి.. 2008లో తన కెప్టెన్సీలో అండర్‌ -19 వరల్డ్‌కప్‌ను భారత్‌కు అందించడం ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఆ వెంటనే 19 ఏళ్ల వయసులో జాతీయ జట్టుకు పిలుపు వచ్చింది. కెరీర్‌ మొదట్లో అడపాదడపా జట్టులోకి వచ్చిపోతున్నా.. 2009 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోపి అతని కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పొచ్చు. రెగ్యులర్‌ బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌ సింగ్‌ గాయంతో చాంపియన్స్ ట్రోపికి దూరమవడంతో కోహ్లికి నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 79 పరుగుల ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయం సాధించి పెట్టడంతో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

ఇక అప్పటినుంచి కోహ్లికి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కోహ్లి అంటే చేదనలో కింగ్‌ అనేలా మారిపోయాడు. కోహ్లి వన్డేల్లో చేసిన సెంచరీలు ఎక్కువగా సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ద్వారా వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో టీమిండియా చేదనకు దిగితే కోహ్లి ఉన్నాడంటే గెలుపు ఖాయం అనేంతలా తనదైన ముద్ర వేశాడు. 2012లో వైస్‌ కెప్టెన్‌గా ఎన్నికైన కోహ్లి 2014లో ఎంఎస్‌ ధోని నుంచి టెస్టు బాధ్యతలు స్వీకరించాడు. అనంతరం 2017లో టీ20లతో పాటు పరిమిత ఓవర్ల కెప్టెన్‌గాను ఎంపికయ్యాడు. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్‌ వన్‌గా కొనసాగుతున్న కోహ్లి  248 వన్డేలు, 86 టెస్టులు, 82 టీ20లు ఆడాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top