భారత రెజ్లింగ్ సమాఖ్యకు వినేశ్ ఫొగాట్ క్షమాపణ

Vinesh Phogat Sends Apology To WFI - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్ సమాఖ్యకు వినేశ్ ఫొగాట్ క్షమాపణ చెప్పారు. టోక్యో ఒలింపిక్స్‌లో తన ప్రవర్తనపై డబ్ల్యూఎఫ్‌ఐ పంపిన నోటీసుపై ఆమె స్పందిస్తూ ఆదివారం క్షమాపణ కోరారు. కాగా, టోక్యోలో ఫొగాట్ ప్రవర్తనపై డబ్ల్యూఎఫ్‌ఐ తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆమెపై నిషేధంపై త్వరలో భారత రెజ్లింగ్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకోనుంది.

నిన్న(శనివారం) ఆమె స్పందిస్తూ.. ‘మన దేశంలో ఎంత వేగంగా పైకి ఎదుగుతామో అంతే వేగంగా కింద పడిపోతాం. ఒక్క పతకం రాలేదంటే ఇక అంతా అయిపోయినట్లే. ఇప్పుడూ అదే జరుగుతోంది. అంతా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఓటమికి కారణాలేమిటో నాకు బాగా తెలుసు. ఒలింపిక్స్‌ కోసం అన్ని రకాలుగా సిద్ధమై వచ్చాను. కానీ నన్ను దురదృష్టం వెంటాడింది’ అని వినేశ్‌ పేర్కొంది. 

 రెజ్లింగ్‌పై అవగాహనలేని, షూటింగ్‌తో సంబంధం ఉన్న ఫిజియోను తనకు కేటాయించారని, బౌట్‌కు ముందు తన బరువు తగ్గించుకునే విషయంలో తానే ఆమెకు వివరించాల్సి వచ్చిందని వినేశ్‌ ఆరోపించింది. రెండుసార్లు కరోనా సోకడంతో తన శరీరంలో అసలు ప్రొటీన్‌ లేకుండా పోయిందని ఆమె చెప్పింది. తన వల్ల భారత రెజ్లర్లు కోవిడ్‌ బారిన పడకూడదనే విడిగా ఉన్నానని, ఇందులో తప్పేముందని ప్రశ్నించిన వినేశ్‌... గత రెండేళ్లుగా చాలాసార్లు డిప్రెషన్‌కు గురయ్యానని వెల్లడించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top