అదరహో అదితి... ఓహో ఓజస్‌ | Sakshi
Sakshi News home page

అదరహో అదితి... ఓహో ఓజస్‌

Published Sun, Aug 6 2023 2:17 AM

Two golds for India in World Archery Championship - Sakshi

అంతర్జాతీయ వేదికపై భారత ఆర్చర్లు అద్భుతం చేశారు...గతంలో ఎన్నడూ చూపించని ప్రదర్శనతో కొత్త చరిత్రను సృష్టించారు... గురి తప్పకుండా లక్ష్యం చేరిన బాణాలతో మన ఆర్చర్లు ప్రపంచ చాంపియన్లుగా నిలిచారు...అటు మహిళల విభాగంలో అదితి స్వామి, ఇటు పురుషుల విభాగంలో ప్రవీణ్‌ ఓజస్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు సాధించి శిఖరాన నిలిచారు. ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో భారత్‌కు తొలి వ్యక్తిగత స్వర్ణం అందించి అదితి ఆనందం పంచిన కొద్ది సేపటికే ప్రవీణ్‌ కూడా పసిడి గెలవడంతో  ‘డబుల్‌ ధమాకా’ మోగింది!  

చాలా గర్వంగా ఉంది. 17 ఏళ్లకే ఈ ఘనత సాధించడం సంతోషంగా అనిపిస్తోంది. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో 52 సెకన్ల మన జాతీయ గీతం వినపడాలని కోరుకున్నాను. పూర్తి ఏకాగ్రతతో షాట్‌పై దృష్టి పెట్టడంతో లక్ష్యం తప్పలేదు. ఇది ఆరంభం మాత్రమే. దేశం తరఫున మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా  – అదితి స్వామి

బెర్లిన్‌: వరల్డ్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఒకే రోజు భారత్‌ తరఫున ఇద్దరు చాంపియన్‌లుగా నిలిచారు. శనివారం జరిగిన ఈ పోటీల కాంపౌండ్‌ విభాగంలో ముందుగా మహారాష్ట్రకు చెందిన అదితి గోపీచంద్‌ స్వామి అగ్రస్థానం సాధించింది. ఫైనల్లో 17 ఏళ్ల అదితి 149–147 స్కోరుతో మెక్సికోకు చెందిన ఆండ్రీయా బెసెరాపై విజయం సాధించింది. పురుషుల కాంపౌండ్‌ ఫైనల్లో ఓజస్‌ ప్రవీణ్‌ దేవ్‌తలే 150–147 తేడాతో ల్యూకాజ్‌ జిల్‌స్కీ (పోలాండ్‌)ను ఓడించాడు.

వరల్డ్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన నెల రోజుల్లోపే సీనియర్‌ విభాగంలోనూ అదితి విశ్వ విజేత కావడం విశేషం కాగా...టోర్నీ చరిత్రలో పురుషుల విభాగంలోనూ భార త్‌కు ప్రవీణ్‌ సాధించిందే తొలి స్వర్ణం. వీరిద్దరూ మహారాష్ట్ర సతారాలోని అకా డమీలో ఒకే చోట శిక్షణ పొందుతున్నారు.

ఓవరాల్‌గా 3 స్వర్ణాలు, ఒక కాంస్యంతో (మొత్తం 4 పతకాలు) సాధించి భారత్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. శుక్రవారం భారత్‌ మహిళల టీమ్‌ విభాగంలో స్వర్ణం సాధించింది.  

పూర్తి ఆధిపత్యం... 
డిఫెండింగ్‌ చాంపియన్‌ సారా లోపెజ్‌ను ప్రిక్వార్టర్స్‌లో ఓడించిన బెసెరా, అదితి మధ్య ఫైనల్‌ పోటాపోటీగా సాగింది. తొలి మూడు బాణాలను సమర్థంగా సంధించిన అదితి మొదటి రౌండ్‌లోనే 30–29తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగు రౌండ్‌లు ముగిసే సరికి 12 బాణాలను లక్ష్యం వద్దకు చేర్చిన అదితి మూడు పాయింట్లు ముందంజలో ఉంది. చివరి రౌండ్‌లో మాత్రం ఒక బాణంతో ‘9’ మాత్రమే స్కోర్‌ చేసినా...అప్పటికే ఆమె విజేత కావడం ఖాయమైంది.

శనివారం సెమీస్, ఫైనల్‌లోనూ 149 పాయింట్లు సాధించిన అదితి మొత్తం నాలుగు పాయింట్లు మాత్రమే కోల్పోయింది. ఫైనల్లో చివరి నాలుగు అవకాశాల్లోనూ ఆమె 30 పాయింట్లు సాధించడం విశేషం.  పురుషుల విభాగంలో కూడా ప్రవీణ్‌ ‘పర్‌ఫెక్ట్‌ స్కోర్‌’తో పసిడి గెలుచుకున్నాడు. ప్రవీణ్‌ ఎక్కడా ఎలాంటి పొరపాటు చేయకపోగా, ఒత్తిడిలో పడిన ల్యూకాజ్‌ చివర్లో ఒక పాయింట్‌ పోగొట్టుకొని రజతంతో సంతృప్తి చెందాడు.  


జ్యోతి సురేఖకు కాంస్యం 
ప్రపంచ చాంపియన్‌షిప్‌ వ్యక్తిగత విభాగంలో 2019లో కాంస్యం, 2021లో రజతం సాధించి∙ఈ సారి స్వర్ణంపై గురి పెట్టిన ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతిసురేఖకు నిరాశ ఎదురైంది. కాంపౌండ్‌ విభాగంలో సురేఖ మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది. సెమీ ఫైనల్లో సురేఖ 145 – 149 స్కోరుతో అదితి స్వామి చేతిలో ఓటమి పాలైంది.

అయితే మూడో స్థానం కోసం జరిగిన పోరులో సురేఖ చక్కటి ప్రదర్శనతో 150 స్కోరు నమోదు చేసింది. ఆమె 150 – 146 స్కోరుతో తుర్కియేకు చెందిన ఐపెక్‌ తోమ్రుక్‌ను ఓడించింది. ఓవరాల్‌గా ఆర్చరీ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో సురేఖకు ఇది ఎనిమిదో పతకం. టీమ్, వ్యక్తిగత విభాగాల్లో కలిపి ఆమె ఒక స్వర్ణం, 4 రజతాలు, 3 కాంస్యాలు గెలుచుకుంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement