రూ.10.23 లక్షలకు ఒక్క టికెట్‌ | Ticket prices at record levels at FIFA World Cup Final Match | Sakshi
Sakshi News home page

రూ.10.23 లక్షలకు ఒక్క టికెట్‌

Apr 3 2026 3:52 AM | Updated on Apr 3 2026 3:52 AM

Ticket prices at record levels at FIFA World Cup Final Match

‘ఫిఫా’ ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ధర

జ్యూరిక్‌: గతంలో తల తాకట్టు పెట్టి అయినా ఫుట్‌బాల్‌ వీరాభిమానులు ప్రపంచకప్‌ టికెట్లు కొని మ్యాచ్‌ల్ని ప్రత్యక్షంగా తిలకించేవారు. ఇప్పుడైతే ఏకంగా ఇల్లే తాకట్టు పెట్టాలేమో! ఎందుకంటే యావత్‌ ప్రపంచాన్నే ఫుట్‌బాల్‌ ఫీవర్‌తో ఊపేసే ‘ఫిఫా’ ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్‌ ధర అక్షరాలా రూ. 10,23,212. అమెరికా కరెన్సీలో 10,990 డాలర్లు. ఈ మొత్తంతో కేవలం 90 నిమిషాల టైటిల్‌ పోరును చూస్తారు. మన దేశంలో ఈ మొత్తంతో ఏడున్నర (75 గ్రాముల) తులాల బంగారు ఆభరణాల్ని కొనేయొచ్చు. 

ఫుట్‌బాలా... మజాకా! త్వరలో అమెరికా, మెక్సికో, కెనడా వేదికలపై ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ సంగ్రామం జరుగనుంది. ఇందులో భాగంగా రెండో కేటగిరీ, మూడో కేటగిరీ టికెట్ల ధరల్ని ‘ఫిఫా’ ఖరారు చేసింది. మొదట గతేడాది డిసెంబర్లో ‘డ్రా’ విడుదల చేసిన సందర్భంలో తొలి దశలో 8680 డాలర్ల (రూ.8 లక్షలు) ధరతో కొన్ని టికెట్లను విక్రయించారు. టోర్నీ దగ్గర పడుతుండటంతో ఫుట్‌బాల్‌ క్రేజీ ప్రపంచకప్‌ను క్యాష్‌ చేసుకునే పనిలో ‘ఫిఫా’ పడింది. 

ఇందులో భాగంగా కేటగిరీ–2 టికెట్లను తొలి దశలో 5575 డాలర్ల (రూ.5.20 లక్షలు)కు విక్రయించగా... ఇప్పుడు 7380 డాలర్ల (రూ.6.87 లక్షలు)కు పెంచేసింది. కేటగిరీ–3 టికెట్ల ధరలు అప్పుడు 4185 డాలర్లు (రూ.3.90 లక్షలు) ఉంటే... ఇప్పుడు 5785 డాలర్ల (రూ.5.38 లక్షలు)కు హెచ్చింపు చేసింది. ఈ టికెట్లను కొనేందుకు అభిమానులు ‘ఫిఫా’ వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలని, సేల్‌ విండో తెరవగానే నిమిషాల్లోనే అమ్ముడయ్యే అవకాశముందని ‘ఫిఫా’ తెలిపింది. 

మెగా ఈవెంట్‌లో గ్రూప్‌ దశలో 72 మ్యాచ్‌లు ఉండగా... బుధవారం 17 మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లనే అందుబాటులో ఉంచింది. నాకౌట్‌ దశ పోటీల టికెట్లు పై జాబితాలో లేవు. జూన్‌ 12న పరాగ్వే–అమెరికా మధ్య జరిగే మ్యాచ్‌ కోసం ప్రీమియం ధర టికెట్లన్నీ అమ్ముడుపోగా... కేవలం 2735 డాలర్ల (రూ.2.54 లక్షల) టికెట్లు కొన్ని మిగిలున్నాయి. అయితే జూన్‌ 19న ఆ్రస్టేలియా, అమెరికా మధ్య జరిగే మ్యాచ్‌ కోసం ఒక్క టికెట్‌ కూడా లేదు. అన్ని కేటగిరీల టికెట్లన్నీ హాట్‌ కేకుల్లా అమ్మడయ్యాయి. అమెరికాలో 11 వేదికలు, మెక్సికోలో 3, కెనడాలో 2 వేదికల్లో సాకర్‌ సంగ్రామం జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement