
నారాయణ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్): సీనియర్ మహిళల జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ రాజ్‌మాత జిజాబాయ్ ట్రోఫీలో తెలంగాణ జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి పోరులో తెలంగాణ జట్టు 8–1 గోల్స్ తేడాతో
ఆంధ్రప్రదేశ్‌పై విజయం సాధించింది. తెలంగాణ జట్టు తరఫున రంజిత దేవి (36వ, 40వ, 51వ, 60వ నిమిషాల్లో) నాలుగు గోల్స్‌తో అదరగొట్టింది. గుగులోత్ సౌమ్య (6వ, 25వ నిమిషంలో), పుల్లూరి సోనీ (21వ, 67వ నిమిషంలో) చెరో రెండు గోల్స్‌తో సత్తా చాటారు.
ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున వ్యాసపురం నందిని (49వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించింది. మ్యాచ్ ఆరంభమైన ఆరో నిమిషంలోనే సౌమ్య గోల్‌తో ఖాతా తెరిచిన తెలంగాణ... ఇక ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉన్న సౌమ్య... రెండు గోల్స్ చేయడంతో పాటు జట్టుకు ఆధిక్యం దక్కడంలో కీలక పాత్ర పోషించింది.
శనివారమే జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో పశ్చిమ బెంగాల్ 7–0 గోల్స్ తేడాతో మేఘాలయపై, సిక్కీం 2–1తో రైల్వేస్‌పై, అస్సాం 7–0తో త్రిపురపై గెలుపొందాయి. ఛత్తీస్‌గఢ్, కర్ణాటక మధ్య మ్యాచ్ 1–1 గోల్స్‌తో ‘డ్రా’ కాగా... మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 0–0తో ‘డ్రా’గా ముగిసింది. తదుపరి మ్యాచ్‌ల్లో సోమవారం ఛత్తీస్‌గఢ్‌తో తెలంగాణ... కర్ణాటకతో ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడనున్నాయి.