T20 World Cup 2021: కోహ్లి సేనకు మద్దతుగా నిలిచిన ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

T20 World Cup 2021: Kevin Pietersen Bats For Team India After Shocking Loss Against New Zealand - Sakshi

Kevin Pietersen Bats For Team India After Shocking Loss Against New Zealand: టీ20 ప్రపంచకప్-2021లో టీమిండియా ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొన్న నేపథ్యంలో జట్టు సభ్యులందరిపై ముప్పేట దాడి మొదలైంది. ఆటగాళ్లను టార్గెట్‌ చేస్తూ అభిమానులు, విశ్లేషకులు మాటల దాడికి దిగుతున్నారు. భారత ఆటగాళ్ల వైఫల్యాలకు ఐపీఎల్‌ కారణమని కొందరంటుంటే.. మరికొందరేమో కీలక మ్యాచ్‌ల్లో టీమిండియా ఒత్తిడికి లోనై చిత్తుగా ఓడటం సర్వసాధారణమని సర్ధుకుపోతున్నారు. 

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కోహ్లి సేనకు బాసటగా నిలిచాడు. ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మద్దతు నిలవాలని అభిమానులకు పిలుపునిచ్చాడు. ఈ మేరకు హిందీలో ట్వీట్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. “ఆటలో జయాపజయాలు సహజమని, ఓ జట్టు గెలిస్తే మరో జట్టు ఓడాల్సి ఉంటుందని అన్నాడు. ఏ ఆటగాడు కూడా ఓడిపోవాలని బరిలోకి దిగడని.. దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని ఆటగాళ్లు గొప్ప గౌరవంగా భావిస్తారని పేర్కొన్నాడు. 

ఆడిన ప్రతి మ్యాచ్‌ గెలవడానికి ఆటగాళ్లేమీ రోబోలు కాదని, వారికి అన్ని సమయాల్లో అభిమానుల మద్దతు అవసరమంటూ” సోమవారం ట్వీట్ చేశాడు. కేపీ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు టీమిండియాకు అనుకూలంగా కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. కాగా, ప్రస్తుత మెగా టోర్నీ టీమిండియా తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని చవిచూడగా.. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. టీమిండియా రెండు మ్యాచ్‎ల్లో ఘోర పరాజయాల్ని ఎదుర్కొని సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. 
చదవండి: క్రికెట్‌ ఆస్ట్రేలియాలో విషాదం.. గంటల వ్యవధిలో ఇద్దరు దిగ్గజాల కన్నుమూత

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top