Dasun Shanaka: ఈ గ్రూపులో మేమే నంబర్‌ 1గా ఉంటామని తెలుసు.. కానీ..

T20 WC 2022: Dasun Shanaka Knew We Could No 1 In This Group But - Sakshi

ICC Mens T20 World Cup 2022 - Sri Lanka vs Netherlands, 9th Match, Group A: టీ20 ప్రపంచకప్‌-2021లో ఆకట్టుకోలేకపోయిన శ్రీలంక ఈసారి పసికూనలతో క్వాలిఫైయర్స్‌ ఆడింది. ఇందులో భాగంగా.. ఆసియా కప్‌-2022 విజేతగా నిలిచి అదే జోష్‌లో టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో అడుగుపెట్టిన లంకకు ఆరంభ మ్యాచ్‌లోనే నమీబియా షాకిచ్చింది. దీంతో సూపర్‌-12కు అర్హత సాధించాలంటే గ్రూప్‌-ఏలో మిగిలిన రెండు మ్యాచ్‌లలో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి.

ఈ క్రమంలో రెండో మ్యాచ్‌లో యూఏఈని ఓడించింది. ఓపెనర్‌ పాతుమ్‌ నిసాంక 74 పరుగులతో చెలరేగగా.. బౌలర్లు విశ్వరూపం చూపించడంతో 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో నెట్‌ రన్‌రేటును మెరుగుపరచుకుంది.

గట్టి పోటీ ఎదురైంది!
అదే జోరులో గురువారం(అక్టోబరు 20) నెదర్లాండ్స్‌తో డూ ఆర్‌ డై మ్యాచ్‌లో బరిలోకి దిగిన శ్రీలంకకు.. ప్రత్యర్థి జట్టు నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఓపెనర్‌ కుశాల్‌ మెండిస్‌(79) రాణించడంతో 162 పరుగుల స్కోరు చేయగలిగిన లంక.. వనిందు హసరంగ 3 వికెట్లతో చెలరేగడంతో ఆఖరికి 16 పరుగుల తేడాతో గెలుపొందింది. 

మేము నంబర్‌ 1..
తద్వారా గ్రూప్‌-ఏ నుంచి సూపర్‌-12కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ అనంతరం లంక కెప్టెన్‌ దసున్‌ షనక మాట్లాడుతూ.. ‘‘ఈ గ్రూపులో మేము నంబర్‌ 1గా ఉంటామని తెలుసు. కానీ ఆరంభ మ్యాచ్‌లోనే మాకు చేదు అనుభవం ఎదురైంది. 

అయితే, మా ఆటగాళ్ల ప్రదర్శన బాగానే ఉంది. ముఖ్యంగా బౌలింగ్‌ గ్రూపు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ రోజు వికెట్‌ను దృష్టిలో పెట్టుకుని మొదటి 10 ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయాలనుకున్నాం. మా ప్రణాళికను అమలు చేయగలిగాం’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో కుశాల్‌ మెండిస్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

టీ20 ప్రపంచకప్‌-2022: క్వాలిఫైయర్స్‌
గ్రూప్‌-ఏ: శ్రీలంక, నమీబియా, నెదర్లాండ్స్‌, యూఏఈ
రౌండ్‌రాబిన్‌ పద్ధతిలో నిర్వహణ

చదవండి: T20 WC 2022- Ind Vs Pak: ‘అలా అయితే అక్టోబరు 23న ఇండియాతో పాక్‌ మ్యాచ్‌ ఆడదు’
Predicted Playing XI: పాక్‌తో తొలి మ్యాచ్‌.. తుది జట్టు ఇదే! పంత్‌, అశ్విన్‌, హుడాకు నో ఛాన్స్‌!
ఆసియా కప్‌ నిర్వహణపై పాక్‌కు దిమ్మతిరిగిపోయే కౌంటరిచ్చిన కేంద్ర క్రీడల మంత్రి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top