'నేను బాగానే ఉన్నాను.. అతడు పుట్టిన రోజున తనకు తనే గిఫ్ట్‌ ఇచ్చుకున్నాడు' | Suryakumar updates on injury scare following win over SA | Sakshi
Sakshi News home page

Suryakumar Yadav: 'నేను బాగానే ఉన్నాను.. అతడు పుట్టిన రోజున తనకు తనే గిఫ్ట్‌ ఇచ్చుకున్నాడు'

Dec 15 2023 7:35 AM | Updated on Dec 15 2023 8:48 AM

Suryakumar updates on injury scare following win over SA - Sakshi

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను టీమిండియా డ్రాగా ముగించింది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో 106 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను 1-1 భారత్‌ సమం చేసింది. తొలి టీ20 వర్షర్పాణం కాగా.. రెండో టీ20, మూడో టీ20లో వరుసగా ప్రోటీస్‌, భారత్‌ గెలుపొందాయి. 202 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 95 పరుగులకే ప్రోటీస్‌ కుప్పకూలింది.

భారత బౌలర్లలో స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ 5 వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. అతడితో పాటు రవీంద్ర జడేజా రెండు, ముఖేష్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ తలా వికెట్‌ సాధించారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో డేవిడ్‌ మిల్లర్‌(35) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.

భారత బ్యాటర్లలో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(100) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. అతడితో జైశ్వాల్‌(60) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. ఇక అద్భుత విజయంపై టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ స్పందించాడు. సమతుల్యంగా ఆడటంతోనే విజయం సాధించామని సూర్య తెలిపాడు. అదే విధంగా తన గాయంపై కూడా సూర్య అప్‌డేట్‌ ఇచ్చాడు. ఫీల్డింగ్‌ చేస్తుండగా అతడి చీలమండకు గాయమైంది. 

"నేను బాగానే ఉన్నాను. ప్రస్తుతం మంచిగా నడవగలుగుతున్నాను. ఈ మ్యాచ్‌లో విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది.  ఫియర్‌లెస్‌ క్రికెట్‌ ఆడాలని నిర్ణయించుకున్నాం. ఈ మ్యాచ్‌లో అదే చూసి చూపించాం. ముందుగా బ్యాటింగ్ చేసి ప్రత్యర్ధి ముందు మంచి టార్గెట్‌ను పెట్టాలనుకున్నాం. అందుకే టాస్‌ ఓడినప్పటికీ తొలుత బ్యాటింగ్‌ చేయాలనుకున్నాను. ఈ మ్యాచ్‌లో మా బాయ్స్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.

వారి ప్రదర్శన పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. ఇక కుల్దీప్‌ కోసం ఎంత చెప్పుకున్న తక్కువే. ఎప్పుడూ వికెట్లు సాధించాలన్న ఆకలితో ఉంటాడు. కుల్దీప్‌ పుట్టిన రోజున తనకు తనే గిఫ్ట్‌ ఇచ్చుకున్నాడు. ఏ మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలంటే  అక్కడి పరిస్ధితులను అర్ధం చేసుకోవాలి. సమతుల్యంగా ఆడితే ఎక్కడైనా గెలుపొందవచ్చు"అని పోస్ట్‌ మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు. కాగా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు సూర్య భాయ్‌కే దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement