ధోనిని ఆలింగనం చేసుకున్న రైనా (PC: CSK/X)
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని కెరీర్ చరమాంకానికి చేరుకుంది. ఐపీఎల్‌కు తలా దాదాపుగా వీడ్కోలు పలికినట్లే. నిజానికి 44 ఏళ్ల ధోని ఐపీఎల్ 19వ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లోనైనా బరిలోకి దిగకపోతాడా అంటూ కళ్లు కాయలు కాచేలా అభిమానులు ఎదురు చూశారు.
కానీ మరోసారి వారికి నిరాశ తప్పలేదు. గత ఆరు ‘హోం’ మ్యాచ్‌లలో కనీసం గ్రౌండ్ మొహం చూడని ధోని (MS Dhoni) సీజన్‌లో తొలిసారి మైదానానికి వచ్చాడు. చెపాక్‌లో ఇది ఆఖరి మ్యాచ్ కావడంతో ఈసారి తలా బరిలోకి దిగవచ్చని వినిపించింది.
అదొక్కటే మిగిలింది
అయితే ధోని మాత్రం పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. చెన్నై తమ చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లో ఆడనుంది. ఇక్కడే ఆడని ధోని అక్కడ ఆడే అవకాశాలు దాదాపుగా లేనట్లే.
అంటే 2008 నుంచి ధోని ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడని సీజన్‌గా ఇది ముగియవచ్చు! ఇక అతడి నుంచి అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటన ఎప్పుడు వస్తుందా అనే వేచిచూడటమే మిగిలింది.
ధోని అభిమానుల హృదయాలను ముక్కలు
ఈ నేపథ్యంలో చెన్నై దిగ్గజం, భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చెప్పిన విషయం ధోని అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. ప్రస్తుతం ఐపీఎల్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న చిన్న తలా.. చెపాక్‌లో ధోనిని కలిశాడు. ఈ సందర్భంగా తాను ధోనితో రిటైర్మెంట్ గురించి చర్చించినట్లు రైనా తెలిపాడు.
నా శరీరం కాస్త బలహీనంగా ఉంది
స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘తలా... ‘ఐపీఎల్-2026 సీజన్‌ను నువ్వు మిస్ చేశావు. వచ్చే ఏడాది ఇంతకు రెట్టించిన ఉత్సాహంతో తిరిగి రావాలి’ అని చెప్పాను. అందుకు బదులుగా.. ‘నా శరీరం కాస్త బలహీనంగా ఉంది’ అని ధోని అన్నాడు.
‘ఏదేమైనా.. మేము ఇవన్నీ నమ్మలేము. నువ్వు కచ్చితంగా వచ్చే ఏడాది ఆడాల్సిందే’ అని అన్నాను. ఆడటం, ఆడకపోవడం పూర్తిగా ధోని వ్యక్తిగత నిర్ణయం. నాకు తెలిసి ఆయన సానుకూల దృక్పథంతోనే ఉన్నాడు. జట్టు కూడా సమష్టిగా ముందుకు సాగుతుందనే భావిస్తున్నా’’ అని రైనా పేర్కొన్నాడు.
కాగా ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి చెన్నైతోనే ఉన్న ధోని.. కెప్టెన్ హోదాలో జట్టును రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. ధోనితో పాటు రైనా కూడా చెన్నై జట్టు ప్రధాన సభ్యుడిగా వెలుగొందాడు. అభిమానులు అతడిని చిన్న తలా అని ముద్దుగా పిలుచుకుంటారు.
Thala 💛 Chinna Thala#WhistlePodu pic.twitter.com/X4QmTgbmxa
— Chennai Super Kings (@ChennaiIPL) May 19, 2026


