వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ | SRH Beat CSK By 5 Wickets To Seal IPL 2026 Playoff Berth, Cummins Praises Ishan Kishan, Says He Deserves All The Credit | Sakshi
Sakshi News home page

Pat Cummins: వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము

May 19 2026 4:57 AM | Updated on May 19 2026 9:26 AM

Ishan Kishan Deserves All The Credit, Says Pat Cummins

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌మ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖ‌రారు చేసుకుంది. సోమ‌వారం చెపాక్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించిన ఎస్‌ఆర్‌హెచ్.. ఎనిమిదో సారి ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 180 ప‌రుగులు చేసింది. అనంత‌రం 181 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఎస్ఆర్‌హెచ్ కేవ‌లం 5 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 19 ఓవ‌ర్ల‌లో చేధించింది. ఎస్ఆర్‌హెచ్ విజ‌యంలో ఇషాన్ కిష‌న్‌ది కీల‌క పాత్ర‌.

కిషన్‌ కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70 పరుగులు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. హెన్రిచ్ క్లాసెన్ కూడా 47 ప‌రుగుల‌తో రాణించాడు. ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ స్పందించాడు. జ‌ట్టును గెలిపించిన క్లాసెన్‌, కిష‌న్‌పై క‌మ్మిన్స్ ప్రశంస‌ల వ‌ర్షం కురిపించాడు.

ఈ మ్యాచ్‌లో మా జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న చాలా సంతృప్తిని ఇచ్చింది. మేము సాధార‌ణంగా ఆడే శైలికి ఇది భిన్నమైన మ్యాచ్. ఇక్కడి వికెట్‌పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. కానీ ఇషాన్, క్లాసెన్ బ్యాటింగ్ చేసిన తీరు నిజంగా ఒక అద్భుతం. వారిద్దరూ బౌలర్లను టార్గెట్ చేస్తూ ధైర్యంగా షాట్లు ఆడుతూ మ్యాచ్‌ను గెలిపించారు. 

ఈ ల‌క్ష్యాన్ని చేధించేందుకు మాకు 1-2 భాగస్వామ్యాలు అవసరమని మేం భావించాం.  ఎందుకంటే క్రీజులోకి వ‌చ్చే కొత్త బ్యాట‌ర్‌కు  పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. క్రీజులో కుదురుకున్నాక బ్యాటింగ్ కాస్త సుల‌భ‌మ‌వుతుంది.  క్లాసెన్‌, కిష‌న్ ప్ర‌ణాళిక‌లు త‌గ్గ‌ట్టు ఆడారు. వారిద్ద‌రూ సరైన బౌలర్లను టార్గెట్ చేసుకుని కొన్ని అద్భుతమైన షాట్లు ఆడారు. 

గ‌త మ్యాచ్‌లో 86 ప‌రుగుల‌కే ఆలౌటైన త‌ర్వాత మేము మా బ్యాటింగ్ గురుంచి చ‌ర్చించాము. నిజం చెప్పాలంటే మా జ‌ట్టు  బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌కు అంత‌గా ఫేమ‌స్ కాదు. కానీ ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు ఆడ‌గ‌ల‌మ‌ని ఈ మ్యాచ్‌లో నిరూపించాం. అయితే మా బౌలింగ్ సమయంలోనే పిచ్ కాస్త స్లోగా ఉంది. బంతి కొద్దిగా లోపలికి వస్తూ, గ్రిప్ అవ్వ‌డం గ‌మ‌నించాము. అలాంటి ప‌రిస్థితుల్లో భారీ షాట్లు ఆడ‌డం కుద‌ర‌దు. 

కానీ మా బ్యాట‌ర్లు పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని ఆడారు. ఈ పిచ్‌పై 180 పరుగులు మంచి స్కోరే. కానీ చేధించ‌గ‌ల‌మ‌న్న న‌మ్మ‌కం మాకు ఉండేది. టాస్ గురుంచి కూడా పెద్దగా ఆలోచించ‌లేదు. ఎందుకంటే ఇక్క‌డ సెకెండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ కూడా గెలిచాయి. మాకు మ‌రో మ్యాచ్ మిగిలి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టాప్-2లో నిలిచేందుకు ప్రయత్నిస్తాం. 

అయితే ప్లే ఆఫ్స్‌కు అధికారికంగా అర్హ‌త సాధించ‌డం చాలా సంతోషంగా ఉంది.  కానీ అస‌లైన క‌థ ఇప్పుడే మొద‌లువుతోంది. ఇప్ప‌టికంటే ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డాలి. ఈ విజ‌యాల్లో కిష‌న్‌ది కూడా కీలక పాత్ర‌. సగం సీజ‌న్ వ‌ర‌కు అత‌డే కెప్టెన్‌గా ఉన్నాడు. కాబ‌ట్టి అత‌డికి చాలా ఎక్కువ క్రెడిట్ దక్కాలి. మా టీమ్ అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా ఉంది. రాబోయే మ్యాచ్‌ల‌లో కూడా ఇదే రిథ‌మ్‌ను కొన‌సాగిస్తామ‌ని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫ‌ర‌న్స్‌లో క‌మ్మిన్స్ పేర్కొన్నాడు.
చదవండి: ధోని వీడ్కోలు.. ఒక శకం ముగిసింది!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement