పాకిస్తాన్‌ లీగ్‌ ఆడుతుండగానే మరో లీగ్‌తో ఒప్పందం చేసుకున్న స్టీవ్‌ స్మిత్ | Steve Smith Signs For A New Tournament While Playing In PSL | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ లీగ్‌ ఆడుతుండగానే మరో లీగ్‌తో ఒప్పందం చేసుకున్న స్టీవ్‌ స్మిత్

Apr 10 2026 4:55 PM | Updated on Apr 10 2026 5:01 PM

Steve Smith Signs For A New Tournament While Playing In PSL

ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2026 ఆడుతుండగానే మరో లీగ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అమెరికా వేదికగా జరిగే మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లోని వాషింగ్టన్‌ ఫ్రీడం ఫ్రాంచైజీతో అతను డీల్‌ కుదుర్చుకున్నాడు. ఈ ఫ్రాంచైజీకి స్టీవ్‌ 2024 ఎడిషన్‌లోనూ ఆడాడు. 

ఆ సీజన్‌లో ఫ్రీడంకు కెప్టెన్‌గానూ వ్యవహరించి టైటిల్‌ గెలిపించాడు. ఆ సీజన్‌లో ఫ్రీడం​ టైటిల్‌ గెలవడంలో స్టీవ్‌ది కీలకపాత్ర (9 ఇన్నింగ్స్‌ల్లో 56 సగటున, 148.67 స్ట్రయిక్‌రేట్‌తో 336 పరుగులు). ఇతరత్రా కారణాల వల్ల గత సీజన్‌ మిస్‌ అయిన స్టీవ్‌, ఇప్పుడు (2026) మళ్లీ ఫ్రీడంతో జతకట్టాడు.

ఈ జనరేషన్‌లో అత్యుత్తమ టెస్ట్‌ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న స్టీవ్‌, ఇప్పుడిప్పుడే టీ20ల్లోనూ తన మార్కు చూపిస్తున్నాడు. బిగ్‌బాష్‌ లీగ్‌ గత రెండు ఎడిషన్లలో ఆకాశమే హద్దుగా చెలరేగిన స్టీవ్‌.. ప్రస్తుతం పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లోనూ అదే ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. 

పీఎస్‌ఎల్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌కు ఆడుతున్న స్టీవ్‌.. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 154కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో స్టీవ్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌తో కలిసి ముల్తాన్‌కు మెరుపు ఆరంభాలు అందిస్తున్నాడు. 

స్టీవ్‌ రాణిస్తుండటంతో పీఎస్‌ఎల్‌ 2026లో ముల్తాన్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని టీ20 లీగ్‌ల్లో ఆడటం మొదలుపెట్టిన స్టీవ్‌కు ఐపీఎల్‌లో మాత్రం అవకాశం దక్కలేదు. ఈ సీజన్‌ వేలంలో పాల్గొన్నా స్టీవ్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement