శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) బోర్డు సంక్షోభంలో కూరుకుపోయింది. లంక క్రికెట్ అధ్యక్షుడు షమీ సిల్వా సహా బోర్డు సభ్యులంతా తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేయడం సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో వీరు తమ రాజీనామా లేఖలను శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే, క్రీడల శాఖ మంత్రి సునీల్ కుమార గమాగేలకు పంపినట్లు తెలుస్తోంది.
అయితే జాతీయ జట్టు వరుస వైఫల్యాలు, బోర్డులో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో షమీ సిల్వాపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇటీవల భారత్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు కనీసం సూపర్-8 దశకు కూడా చేరుకోలేకపోయింది. ఈ పేలవ ప్రదర్శనే అనూహ్య రాజీనామాలకు కారణమని తెలుస్తోంది.
65 ఏళ్ల షమీ సిల్వా 2019 నుంచి శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2021, 2023, 2025 సంవత్సరాల్లో ఆయన ఏకగ్రీ వమయ్యారు. 2025లో జై షా తర్వాత ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగానూ సిల్వా బాధ్యతలు చేపట్టారు. అయితే షమీ సిల్వా హయాంలో శ్రీలంక క్రికెట్ బోర్డు వివాదాల్లో చిక్కుకోవడం ఇది తొలిసారి కాదు.
2023 వన్డే ప్రపంచకప్‌లో జట్టు దారుణంగా విఫలం కావడంతో అప్పటి క్రీడల మంత్రి బోర్డును రద్దు చేశారు. ఇది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధనలకు విరుద్ధం కావడంతో, శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని ఐసీసీ తాత్కాలికంగా రద్దు చేసింది. దీని ఫలితంగా శ్రీలంకలో జరగాల్సిన అండర్-19 ప్రపంచకప్‌ను దక్షిణాఫ్రికాకు తరలించారు.
ఇక శ్రీలంక 1973 క్రీడా చట్టం ప్రకారం క్రీడా సమాఖ్యలను రద్దు చేసే అధికారం మంత్రికి ఉన్నప్పటికీ, ఎన్నికైన సంస్థలలో ప్రభుత్వ జోక్యాన్ని ఐసీసీ అంగీకరించదు. ప్రస్తుత పరిణామాలపై ఐసీసీకి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే, కొత్త ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.


