SRH Vs RR: 8 కోట్లు పెట్టి కొన్నది ఎనిమిదో స్థానంలో ఆడించడానికా? పూరన్‌పై మీకు నమ్మకం.. కానీ

SRH Vs RR: Did You Pick Player For 8 Crore To Make Him Bat No 8 Slams Aakash Chopra - Sakshi

IPL 2022 SRH Vs RR:  గత సీజన్‌ తాలుకు పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ సన్‌రైజర్స్‌హైదరాబాద్‌ ఐపీఎల్‌-2022లో తమ ఆరంభ మ్యాచ్‌లో దారుణ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటోంది. రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో 61 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలై అప్రదిష్టను మూటగట్టుకుంది. ముఖ్యంగా ముగ్గురు బ్యాటర్లు మినహా మిగతా వాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితం కావడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది.

కాగా మంగళవారం రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లు చేసిన స్కోర్లు వరుసగా.. 2,9,0,0,57, 4,24,40,3. ఇందులో ఎయిడెన్‌ మార్కరమ్‌దే టాప్‌ స్కోరు. 57 పరుగులతో అతడు అజేయంగా నిలవగా.. ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ఆఖర్లో 14 బంతుల్లోనే 40 పరుగులు రాబట్టి పరువును నిలబెట్టాడు. 

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎనిమిదిన్నర కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసిన ఆల్‌రౌండర్‌ను ఎనిమిదో స్థానంలో ఆడించడం ఏమిటని ప్రశ్నించాడు. ఈ మేరకు మ్యాచ్‌ ఫలితాన్ని తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా విశ్లేషిస్తూ.. ‘‘సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రదర్శన అస్సలు బాగాలేదు. ఎయిడెన్‌ మార్కరమ్‌ ఒంటరిగా పోరాడి హైదరాబాద్‌ పరువును కాపాడగలిగాడు.

ఇక.. వాషింగ్టన్‌ సుందర్‌ విషయానికొస్తే.. అతడు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. ఎనిమిది కోట్లు ఖర్చు చేసి అతడిని కొన్నది ఎనిమిదో స్థానంలో పంపడానికా? అతడు అంతకంటే ఎక్కువే చేయగలడు’’అంటూ సుందర్‌ను టాపార్డర్‌కు ప్రమోట్‌ చేయాల్సిందిగా సూచించాడు. ‘‘సుందర్‌ను టాపార్డర్‌లో ఆడించాలి. అభిషేక్‌ శర్మను లోయర్‌ ఆర్డర్‌కు పంపండి. మీరు నికోలస్‌ పూరన్‌పై నమ్మకం ఉంచారు.

కానీ వాషింగ్టన్‌ సుందర్‌ అతడి కంటే తానెంతో మెరుగని నిరూపించాడు’’ అని ఆకాశ్‌ చోప్రా ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంఛైజీపై విమర్శలు గుప్పించాడు. ఇక రాజస్తాన్‌తో మ్యాచ్‌లో కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌తో పాటు అభిషేక్‌ శర్మ ఓపెనింగ్‌కు దిగిన సంగతి తెలిసిందే. ఇక మెగా వేలం-2022లో భాగంగా సన్‌రైజర్స్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను 8.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.

చదవండి: IPL 2022- Kane Williamson: అనవసరంగా బలయ్యాడు! కేన్‌ విలియమ్సన్‌కు భారీ షాక్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top