
నేటి నుంచి టి20 సిరీస్
డార్విన్ (ఆ్రస్టేలియా): వచ్చే ఏడాది జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్ కోసం ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. 2026 ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక వేదికగా టి20 వరల్డ్ కప్ జరగనుండగా... దానికి ముందు సన్నాహకంగా ఈ రెండు జట్ల మధ్య నేటి నుంచి మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ జరగనుంది. 2023 తర్వాత ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య అంతర్జాతీయ టి20 మ్యాచ్ జరగలేదు. గతేడాది టీమిండియా చాంపియన్‌గా నిలిచిన వరల్డ్‌కప్‌లో ఆ్రస్టేలియా ఆకట్టుకోలేకపోగా... దక్షిణాఫ్రికా ఫైనల్లో ఓడింది.
ఇరు జట్ల మధ్య ఇటీవల ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ జరగగా... అందులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఆ తర్వాత జింబాబ్వేలో పర్యటించిన సఫారీ జట్టు... ముక్కోణపు టి20 సిరీస్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. మరోవైపు ఆ్రస్టేలియా జట్టు వెస్టిండీస్ గడ్డపై 5–0తో టి20 సిరీస్ గెలుచుకుంది. ఆ సిరీస్‌కు అందుబాటులో లేని ట్రావిస్ హెడ్ తిరిగి ఆసీస్ జట్టులో చేరనుండగా... ఎయిడెన్ మార్క్‌రమ్, కగిసో రబాడ దక్షిణాఫ్రికా జట్టులో పునరాగమనం చేస్తున్నారు.
ఆసీస్ ప్రధాన పేసర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ ఈ సిరీస్‌కు కూడా దూరంగా ఉండనుండగా... జోష్ హాజల్‌వుడ్ పేస్ భారాన్ని మోయనున్నాడు. 2008 తర్వాత డారి్వన్‌లో అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించనుండటం ఇదే తొలిసారి కాగా... మిచెల్ మార్ష్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇటీవల విండీస్‌తో సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మార్ష్.. హెడ్‌తో కలిసి వచ్చే ఏడాది వరల్డ్‌కప్‌లో ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు శనివారమే ప్రకటించాడు.
‘హెడ్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తా. చాన్నాళ్లుగా మేం కలిసి ఆడుతున్నాం. మా మధ్య మంచి అనుబంధం ఉంది. టి20 వరల్డ్‌కప్‌లోనూ ఇదే కొనసాగుతుంది’అని మార్ష్ అన్నాడు. ఇన్‌గ్లిస్, కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ ఓవెన్‌తో ఆసీస్ బలంగా ఉంది. యువ ఆటగాడు డెవాల్డ్ బ్రేవిస్‌పై దక్షిణాఫ్రికా భారీ ఆశలు పెట్టుకుంది. మార్క్‌రమ్, రికెల్టన్, డసెన్, బ్రేవిస్, స్టబ్స్, లిండె, బాష్‌తో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ బలంగా ఉంది. రబాడ, బర్గర్, ఎంగిడి బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు.