ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా | South Africa A beat England Lions by 8 Wickets in 1st Unofficial test | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా

May 25 2026 8:38 PM | Updated on May 25 2026 8:38 PM

South Africa A beat England Lions by 8 Wickets in 1st Unofficial test

రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా-ఏ జట్టు ఘన విజయం సాధించింది. అరండల్‌ (ఇంగ్లండ్‌) వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పెద్దగా అనుభవం లేని లయన్స్‌ను ప్రొటీస్‌-ఏ టీమ్‌ 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లయన్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో 157, రెండో ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్‌ కాగా.. సౌతాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లోనే (331 ఆలౌట్‌) భారీ ఆధిక్యాన్ని మూటగట్టుకొని, రెండు ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని (214) కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.  

ఛేదనలో సెనోక్వానే (55), జోర్డన్‌ హెర్మన్‌ (70 నాటౌట్‌), జుబేర్‌ హంజా (54 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించి సౌతాఫ్రికాను గెలిపించారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా తరఫున కెప్టెన్‌ మార్కస్‌ అకెర్‌మన్‌ (173) భారీ సెంచరీతో కదంతొక్కాడు.

ఇంగ్లండ్‌ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. కనీసం ఒక్క బ్యాటర్‌ కూడా హాఫ్‌ సెంచరీ మార్కును తాకలేకపోయాడు. 25 పరుగులు చేసిన ఏకాన్ష్‌ సింగ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. జేసన్‌ స్మిత్‌ 4, మొకోయెనా 3, డేన్‌ పీటర్సన్‌ 2, బార్ట్‌మన్‌ ఓ వికెట్‌తో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.

తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైన లయన్స్‌ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకున్నారు. ఓపెనర్‌ ఆసా ట్రైబ్‌ (135), బెన్‌ మేస్‌ (105) సెంచరీలతో సత్తా చాటారు. అయినా వారు సౌతాఫ్రికా ముందు సరిపడా లక్ష్యాన్ని ఉంచలేకపోయారు. దీంతో స్వదేశంలో లయన్స్‌కు ఓటమి తప్పలేదు. ఈ సిరీస్‌లో రెండో టెస్ట్‌  మే 29న మొదలవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement