స్టార్ ఆల్‌రౌండర్‌కు ఊహించని షాక్.. ఏడాది పాటు నిషేధం! ఏం జరిగిందంటే?

శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ చమికా కరుణరత్నేపై శ్రీలంక క్రికెట్ ఏడాది పాటు నిషేధం విధించింది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో బోర్డుకు సంబంధించిన పలు అగ్రిమెంట్‌లను కరుణరత్నే ఉల్లంఘించాడు.
దీనిపై విచారణ జరిపేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని నియమించింది. అయితే కమిటీ విచారణలో నిబంధనలను ఉల్లంఘించినట్లు కరుణరత్నే అంగీకరించాడు. దీంతో ఏడాది పాటు ఎటువంటి క్రికెట్ ఆడకుండా అతడిపై లంక క్రికెట్ బోర్డు వేటు వేసింది. అతడిపై నిషేదం విధించడమే కాకుండా 5000 వేల డాలర్ల( భారత కరన్సీ ప్రకారం రూ. 4లక్షలు) జరిమానా కూడా విధించింది.
"టీ20 ప్రపంచకప్-2022 సందర్భంగా కరుణరత్నే బోర్డు నిబంధనలను ఉల్లంఘించాడు. అతడి చేసిన తప్పిదాలపై ముగ్గురు సభ్యలతో కూడిన విచారణ కమిటీని వేశాం. కమిటీ విచారణలో అతడు నేరాన్ని అంగీకరించాడు. అతడు ఇటువంటి తప్పిదాలకు మరోసారి పాల్పడకుండా గట్టిగా హెచ్చరించాలని శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది.
దీంతో అతడిపై ఏడాది పాటు అన్ని రకాల క్రికెట్ ఆడకుండా కమిటీ నిషేదం విధించింది. అదే విధంగా 5000 వేల డాలర్ల ఫైన్ కూడా ఫైన్ కూడా చెల్లించాలంటూ అంటూ" శ్రీలంక క్రికెట్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఆసియాకప్-2022ను శ్రీలంక కైవసం చేసుకోవడంలో కరుణరత్నే కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ఆఫ్గానిస్తాన్‌తో తొలి వన్డేకు ముందు లంక క్రికెట్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. ఎక్స్‌ప్రెస్ పేసర్ ఎంట్రీ! సంజూ కూడా
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు