IPL 2025: చరిత్ర సృష్టించిన శ్రేయస్‌ అయ్యర్‌ | Shreyas Iyer Became The First Player In IPL History To Register 90 Plus Scores On Captaincy Debut For Two Different Franchises | Sakshi
Sakshi News home page

IPL 2025: చరిత్ర సృష్టించిన శ్రేయస్‌ అయ్యర్‌

Mar 26 2025 1:39 PM | Updated on Mar 26 2025 1:39 PM

Shreyas Iyer Became The First Player In IPL History To Register 90 Plus Scores On Captaincy Debut For Two Different Franchises

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో నిన్న (మార్చి 25) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఓ అల్టిమేట్‌ రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసే అవకాశమున్నా జట్టు ప్రయోజనాల కోసం వదులుకున్న అయ్యర్‌.. లీగ్‌ చరిత్రలో రెండు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున కెప్టెన్సీ అరంగేట్రంలో 90 ప్లస్‌ స్కోర్లు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృషిం‍చాడు. 

2018 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్సీ డెబ్యూలో అజేయమైన 93 పరుగులు (కేకేఆర్‌పై) చేసిన అయ్యర్‌.. తాజాగా పంజాబ్‌ కెప్టెన్‌గా అరంగేట్రంలో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో శ్రేయస్‌ మరో విషయంలోనూ రికార్డుల్లోకెక్కాడు. 

కెప్టెన్సీ అరంగేట్రంలో మూడో అత్యధిక స్కోర్‌ చేసిన ఆటగాడిగా తన రికార్డును తనే మెరుగుపర్చుకున్నాడు. ఐపీఎల్‌లో ఓ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో అత్యధిక స్కోర్‌ చేసిన ఘనత సంజూ శాంసన్‌కు దక్కుతుంది. సంజూ 2021లో రాయల్స్‌ కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లో (పంజాబ్‌పై) 119 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా అరంగేట్రంలో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు సంజూ శాంసన్‌ మాత్రమే.

ఐపీఎల్‌లో కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోర్లు..
119 - సంజు శాంసన్ (RR vs PBKS, వాంఖడే, 2021)
99* - మయాంక్ అగర్వాల్ (PBKS vs DC, అహ్మదాబాద్, 2021)
97* - శ్రేయస్ అయ్యర్ (PBKS vs GT, అహ్మదాబాద్, 2025*)
93* - శ్రేయస్ అయ్యర్ (DC vs KKR, ఢిల్లీ, 2018)
88 - ఫాఫ్ డుప్లెసిస్ (RCB vs PBKS, ముంబై, 2022)

  • గుజరాత్‌తో మ్యాచ్‌లో శ్రేయస్‌ మరో మైలురాయిని కూడా తాకాడు. శ్రేయస్‌ టీ20ల్లో 6000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

మూడు జట్లకు కెప్టెన్‌గా..
ఐపీఎల్‌లో శ్రేయస్‌ ఖాతాలో మరో ఘనత కూడా వచ్చి చేరింది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో పంజాబ్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్‌.. ఐపీఎల్‌లో మూడు ఫ్రాంచైజీలకు కెప్టెన్‌గా వ్యవహరించిన నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. శ్రేయస్‌ ఐపీఎల్‌లో ఢిల్లీ, కేకేఆర్‌, పంజాబ్‌ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. శ్రేయస్‌కు ముందు మహేళ జయవర్దనే, కుమార సంగక్కర, స్టీవ్‌ స్మిత్‌ కూడా ఐపీఎల్‌లో మూడు ఫ్రాంచైజీలకు సారథ్యం వహించారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. పంజాబ్‌ కెప్టెన్‌గా శ్రేయస్‌ తన తొలి మ్యాచ్‌లోనే సఫలమయ్యాడు. శ్రేయస్‌ వ్యక్తిగతంగానూ సత్తా చాటడంతో గుజరాత్‌పై పంజాబ్‌ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌.. శ్రేయస్‌ (42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 97 పరుగులు నాటౌట్‌), శశాంక్‌ సింగ్‌ (16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 44 పరుగులు నాటౌట్‌), ప్రియాంశ్‌ ఆర్య  (23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌ 232 పరుగులకే పరిమితమై 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్‌ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్‌మన్‌ గిల్‌ (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్‌ బట్లర్‌ (33 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్‌ (28 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటినా ప్రయోజనం లేకుండా పోయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement