దుబాయ్: దక్షిణాఫ్రికా పర్యటనలో బ్యాట్‌తో ఆకట్టుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లో టాప్–10లో అడుగుపెట్టింది. ఐసీసీ మంగళవారం విడుదల చేసిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా సారథి 646 పాయింట్లతో ఒక స్థానం మెరుగు పరుచుకొని పదో ర్యాంక్‌కు చేరింది.
ఈ సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయిన స్మృతి మంధాన (747 పాయింట్లు) ఒక స్థానం కోల్పోయి ఐదో ర్యాంక్‌లో నిలిచింది. భారత్ నుంచి ఇదే అత్యుత్తమం. మరో ఓపెనర్ షఫాలీ వర్మ (724 పాయింట్లు) రెండు స్థానాలు దిగజారి 8వ ర్యాంక్‌లో నిలిచింది. జెమీమా రోడ్రిగ్స్ (627 పాయింట్లు) మూడు ‘ప్లేస్’లు కోల్పోయి 17వ స్థానానికి చేరింది. సఫారీ పర్యటనలో భారత జట్టు 1–4తో సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే.
ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన దక్షిణాఫ్రికా కెపె్టన్ లౌరా వోల్‌వార్ట్ (786 పాయింట్లు) కెరీర్‌లో అత్యుత్తమ పాయింట్లతో మూడో ర్యాంక్‌కు చేరింది. ఆస్ట్రేలియా ప్లేయర్లు జార్జియా వాల్ (815 పాయింట్లు), బెత్ మూనీ (788 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
బౌలర్ల విభాగంలో ఒక స్థానం మెరుగు పరుచుకొని నాలుగో ర్యాంక్‌కు చేరిన భారత స్పిన్నర్ దీప్తి శర్మ... ఆల్‌రౌండర్‌ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతోంది. బౌలర్ల విభాగంలో ఆంధ్ర అమ్మాయి శ్రీ చరణి 12 స్థానాలు ఎగబాకి కెరీర్ అత్యుత్తమ 11వ ర్యాంక్‌కు చేరింది.


