
ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా జింబాబ్వేతో రేపటి నుండి (మే 22) ప్రారంభం కాబోయే నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా బెన్ స్టోక్స్ వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్‌తో ఎసెక్స్ సీమర్ సామ్ కుక్ టెస్ట్ అరంగేట్రం చేయనున్నాడు.
ఈ మ్యాచ్‌లో జేమీ స్మిత్ ఇంగ్లండ్ వికెట్‌కీపర్‌గా వ్యవహరించనున్నాడు. యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. టాపార్డర్‌లో జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్ కొనసాగనున్నారు. పేస్ విభాగంలో గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, సామ్ కుక్ ఉండనున్నారు. ఇంగ్లండ్ జింబాబ్వేతో చివరిసారిగా 2003లో టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఇంగ్లండ్ హోం సమ్మర్‌లో ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కానుంది.
ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్ స్వదేశంలో వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లు మే 29 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సిరీస్‌ల్లో మొదటిగా వన్డేలు (3), ఆతర్వాత టీ20లు (3) జరుగనున్నాయి. ఈ సిరీస్‌ల కోసం కూడా ఇంగ్లండ్ జట్టును ఇదివరకే ప్రకటించారు.
విండీస్‌తో సిరీస్‌ల తర్వాత ఇంగ్లండ్ స్వదేశంలోనే భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. అనంతరం ఈ ఏడాది నవంబర్‌లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌లో తలపడుతుంది.
జింబాబ్వేతో టెస్ట్ మ్యాచ్‌కు ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్, గస్ అట్కిన్సన్, సామ్ కుక్, జోష్ టంగ్, షోయబ్ బషీర్.