వినేశ్‌ను అడ్డుకోవడం సబబు కాదు: సాక్షి మలిక్‌ | Sakshi Malik Supports Vinesh Phogat Wrestling Comeback | Sakshi
Sakshi News home page

వినేశ్‌ను అడ్డుకోవడం సబబు కాదు: సాక్షి మలిక్‌

May 13 2026 2:43 AM | Updated on May 13 2026 2:43 AM

Sakshi Malik Supports Vinesh Phogat Wrestling Comeback

వినేశ్‌కు ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని ప్రధానమంత్రి, క్రీడా శాఖ మంత్రికి వినతి

న్యూఢిల్లీ: భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌కు మరో రెజ్లర్‌ సాక్షి మలిక్‌ మద్దతుగా నిలిచింది. 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనాలనుకుంటున్న వినేశ్‌... జాతీయ ఓపెన్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌ ద్వారా తిరిగి మ్యాట్‌పై అడుగు పెట్టాలని భావించగా... భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) నిబంధనల సాకుతో అడ్డుపడింది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన అనంతరం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురై పతకం కోల్పోయిన వినేశ్‌... ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో కెరీర్‌కు వీడ్కోలు పలికింది. అనంతరం రాజకీయాల్లో చేరి కాంగ్రెస్‌ పార్టీ తరఫున హరియాణా ఎమ్మెల్యేగా విజయం సాధించింది.

ఇటీవల తల్లి అయిన వినేశ్‌ తిరిగి పోటీలో దిగేందుకు ప్రయత్నించగా... షోకాజ్‌ నోటీసుకు సమాధానం ఇచ్చిన తర్వాతే పోటీల్లో పాల్గొనే అవకాశమిస్తామని డబ్ల్యూఎఫ్‌ఐ పేర్కొంది. నిబంధనల ప్రకారం రిటైర్మెంట్‌ ప్రకటించిన అథ్లెట్లు తిరిగి పోటీల్లో పాల్గొనాలనుకుంటే... ఆరు నెలల నోటీసు నిబంధనను పాటించాలి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు కొత్తగా తల్లి అయిన అథ్లెట్‌  తిరిగి పోటీల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తే వారి కోసం నిబంధనలు మార్చిన సందర్భాలు చాలా ఉన్నాయని సాక్షి వెల్లడించింది. ‘మహిళా అథ్లెట్‌ తల్లి అయిన తర్వాత కూడా దేశం కోసం ఆడటం, పతకాలు గెలవడం కొనసాగించేలా నిబంధనలు ఉండాలి.

గతంలో పలు దేశాల్లో ఇలా నిబంధనల్లో మార్పులు చేశారు. వినేశ్‌ రెజ్లింగ్‌కు విరామమిచ్చిన అనంతరం ఎమ్మెల్యే అయింది. ఇప్పుడు ఆమె తిరిగి రెజ్లింగ్‌లో అడుగు పెట్టకుండా డబ్ల్యూఎఫ్‌ఐ కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. వినేశ్‌కు ట్రయల్స్‌ నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయా, డబ్ల్యూఎఫ్‌ఐని అభ్యరి్థస్తున్నా. దీంతో తల్లి అయిన తర్వాత పతకాలు గెలిచి ఆమె మహిళా సమాజానికి ఆదర్శంగా నిలవగలదు’ అని సాక్షి మలిక్‌ వెల్లడించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన సాక్షి... 2023లో వినేశ్‌ ఫొగాట్, బజరంగ్‌ పూనియాతో కలిసి డబ్ల్యూఎఫ్‌ఐ అప్పటి అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌పై జరిగిన నిరసనల్లో పాల్గొంది.

75 కేజీల విభాగం ఫైనల్లో లక్షయ్‌
తాష్కెంట్: ఆసియా అండర్‌–17 బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్‌ లక్షయ్‌ ఫొగాట్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 75 కేజీల విభాగం ఫైనల్లో లక్షయ్‌ 5:0తో సెయుంగ్‌మిన్‌ లీ (దక్షిణ కొరియా)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన నేళ్ల నరేంద్ర (46 కేజీలు), యశ్‌ యాదవ్‌ (50 కేజీలు), నివేశ్‌ పాల్‌ (54 కేజీలు), నమన్‌ (70 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు సాధించారు. సెమీఫైనల్స్‌లో నరేంద్ర 0:5తో నురాలియెవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో, యశ్‌ 1:4తో ఉస్కుబాటర్‌ (మంగోలియా) చేతిలో, నివేశ్‌ 0:5తో అబ్దుల్‌బాసిత్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో, నమన్‌ 2:3తో అబ్దుమజిదోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓటమి చవిచూశారు. 

Advertisement
 
Advertisement
Advertisement