SA20 2023: డికాక్‌ పోరాటం వృధా.. చెన్నై చేతిలో లక్నో ఓటమి

SA20 2023: Joburg Super Kings Beat Durban Super Giants By 16 Runs - Sakshi

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యంలో నడిచే జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ జట్టు శుభారంభం చేసింది. బుధవారం (జనవరి 11) డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ (లక్నో సూపర్‌ జెయింట్స్‌)తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ కింగ్స్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ సూపర్‌ కింగ్స్‌.. లోయర్‌ ఆర్డర్‌ ఆటగాళ్లు డొనావాన్‌ ఫెరియెరా (40 బంతుల్లో 82 నాటౌట్‌; 8 ఫోర్లు, 5 సిక్సర్లు), రొమారియో షెపర్డ్‌ (20 బంతుల్లో 40; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసిం‍ది. 27 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సూపర్‌ కింగ్స్‌ను వీరి జోడీ (85 పరుగులు జోడించి) ఆదుకుంది. సూపర్‌ జెయింట్స్‌ బౌలర్లలో సుబ్రయెన్‌ 2 వికెట్లు పడగొట్టగా.. కేశవ్‌ మహారాజ్‌, ప్రిటోరియస్‌, అఖిల ధనంజయ, జేసన్‌ హోల్డర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 174 పరుగులకు మాత్రమే పరిమితై ఓటమిపాలైంది. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (52 బంతుల్లో 78; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) సూపర్‌ జెయింట్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. మరో ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ (29 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హెన్రిచ్‌ క్లాసిన్‌ (20), ప్రిటోరియస్‌ (6 బంతుల్లో 14; 2 సిక్సర్లు) తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ బౌలర్లలో అల్జరీ జోసఫ్‌ 2, మలుసి సిబోటో, డొనావాన్‌ ఫెరియెరా, ఆరోన్‌ ఫాంగిసో తలో వికెట్‌ పడగొట్టారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో (82 నాటౌట్‌, ఒక వికెట్‌) అదరగొట్టిన డొనావాన్‌ ఫెరియెరాకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

లీగ్‌లో తదుపరి మ్యాచ్‌లో ఇవాళ సన్‌రైజర్స్‌ ఈస్ట్ర్‌న్‌ కేప్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌), ప్రిటోరియా క్యాపిటల్స్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌) జట్లు తలపడనున్నాయి. భారతకాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్‌ను మినీ ఐపీఎల్‌గా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. ఈ లీగ్‌లో పాల్గొనే మొత్తం ఆరు జట్లను ఐపీఎల్‌ జట్ల యాజమాన్యాలే కొనుగోలు చేశాయి.  

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top