మోకాలి గాయం నేపథ్యంలో ఫెడెక్స్‌ కీలక ప్రకటన

Roger Federer Could Pull Out Of French Open 2021 With Knee Injury - Sakshi

పారిస్‌: ప్రపంచ మాజీ నంబర్‌వన్, స్విట్జర్లాండ్‌ స్టార్‌ ప్లేయర్‌ రోజర్‌ ఫెదరర్ త‌న అభిమానుల‌కు చేదు వార్త చెప్పాడు. ప్రస్తుతం జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్‌లో నాలుగో రౌండ్‌కు చేరుకున్న ఫెడెక్స్‌.. గత కొంతకాలంగా మోకాలి గాయంతో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో అతను ఫ్రెంచ్ ఓపెన్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన మూడో రౌండ్‌ విజయం అనంతరం మీడియా ముందు సూచన ప్రాయంగా వెల్లడించాడు. మోకాలి గాయం చాలా బాధిస్తుంది, దీంతో తాను ఎన్ని రోజులు కొన‌సాగుతానో తెలియ‌డం లేదని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. 

మోకాలికి శస్ట్ర చికిత్స అనంతరం మూడు గంటల 35 నిమిషాల పాటు మ్యాచ్ ఆడటం సాధారణ విషయం కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో మట్టి కోర్ట్‌పై వరుసగా మూడు విజయాలు సాధిస్తానని ఊహించలేదని ఆయన అన్నాడు. కాగా, మూడో రౌండ్లో భాగంగా శ‌నివారం రాత్రి మూడున్నర గంట‌ల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఫెద‌ర‌ర్‌.. 7-6, 6-7, 7-6, 7-5 తేడాతో 59వ సీడ్‌ ఆటగాడు డొమినిక్ కోఫ‌ర్‌పై అద్భుత విజయం సాధించాడు. ఈ క్రమంలో అతను ఫ్రెంచ్‌ ఓపెన్‌లో 15వ సారి  ప్రిక్వార్టర్స్‌ దశకు చేరాడు. కాగా, 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించిన 39 ఏళ్ల ఫెడెక్స్‌.. సోమ‌వారం ఇట‌లీకి చెందిన మాటెయో బెరెటినితో నాలుగో రౌండ్‌లో త‌ల‌ప‌డాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే, త‌న ఆల్‌టైమ్ ఫేవ‌రెట్ వింబుల్డన్‌ కోసమే ఫెదరర్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. జూన్ 28 నుంచి వింబుల్డన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫ్రెంచ్ ఓపెన్‌లో కొనసాగితే వారం కూడా విశ్రాంతి దొరకదని, అందుకే అతను ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకోవాలనుకుం‍టున్నాడని ఆయనపై విమర్శలు వస్తున్నాయి. కాగా, గ‌తేడాది ఆరంభంలో ఫెద‌ర‌ర్ మోకాలికి రెండు స‌ర్జరీలు జ‌రిగాయి. దీంతో చాలా టోర్నీల‌కు అత‌ను దూరంగా ఉన్నాడు. జనవరి 2020లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్ చేతిలో సెమీఫైనల్లో ఓడిపోయిన తరువాత ఖతార్‌ ఓపెన్‌ 2021లో అతను మళ్లీ బరిలోకి దిగాడు. 
చదవండి: వాళ్లిద్దరి కెప్టెన్సీ ఒకేలా ఉంటుంది.. ఆ విషయంలో ధోనీ స్టైల్‌ వేరు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top