చరిత్ర సృష్టించిన రికెల్టన్‌.. ఫాస్టెస్ట్‌ సెంచరీ | Rickelton becomes the fastest Mumbai Indians batter to score a Hundred in IPL history | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన రికెల్టన్‌.. ఫాస్టెస్ట్‌ సెంచరీ

Apr 29 2026 9:54 PM | Updated on Apr 29 2026 9:54 PM

Rickelton becomes the fastest Mumbai Indians batter to score a Hundred in IPL history

ర్యాన్‌ రికెల్టన్‌.. ఈ పేరు ఇప్పుడు ముంబై ఇండియన్స్‌ అభిమానుల నోట మారుమోగుతోంది. ఐపీఎల్‌ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 29) జరుగుతున్న మ్యాచ్‌లో అతడు ఆడిన ఇన్నింగ్స్ ముంబై ఇండియన్స్‌ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది.

ఈ మ్యాచ్‌లో ముంబై టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోగా.. రికెల్టన్‌ కేవలం 44 బంతుల్లోనే శతకం బాదాడు. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో ముంబై ఇండియన్స్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ రికార్డు 18 ఏళ్లుగా సనత్‌ జయసూర్య ఖాతాలో ఉండింది. జయసూర్య ఐపీఎల్‌ అరంభ ఎడిషన్‌లో (2008) ముంబై ఇండియన్స్‌కు ఆడుతూ సీఎస్‌కేపై 45 బంతుల్లో శతక్కొట్టాడు. ఈ రికార్డును రికెల్టన్‌ నేటి మ్యాచ్‌లో బద్దలు కొట్టాడు.

ఐపీఎల్‌లో ముంబై తరఫున వేగవంతమైన సెంచరీలు
44 బంతులు – ర్యాన్ రికెల్టన్
45 బంతులు – సనత్ జయసూర్య
45 బంతులు – తిలక్ వర్మ
47 బంతులు – కెమరూన్‌ గ్రీన్‌

ఈ సెంచరీతో రికెల్టన్ మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల తరఫున అన్ని టీ20 లీగ్‌లలో కలిపి అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌ దిగ్గజం రోహిత్‌ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. 

రికెల్టన్‌ ఎంఐ ఫ్రాంచైజీల (ముంబై ఇండియన్స్‌, ఎంఐ కేప్‌టౌన్‌) తరఫున మొత్తం 3 సెంచరీలు చేయగా.. రోహిత్‌ 2 సెంచరీలు (రెండూ ముంబై ఇండియన్స్‌ తరఫునే) చేశాడు. 2025 ఐపీఎల్‌ సందర్భంగా ఎంఐ ఫ్యామిలీలో చేరిన రికెల్టన్‌ కేవలం రెండేళ్ల వ్యవధిలో రోహిత్‌ శర్మ వంటి దిగ్గజాన్ని అధిగమించడం విశేషం.

ఎంఐ ఫ్రాంచైజీల తరఫున అత్యధిక సెంచరీలు
3 – ర్యాన్ రికెల్టన్ (ఐపీఎల్‌, SA20)
2 – రోహిత్‌ శర్మ (ఐపీఎల్‌)
2 – సూర్యకుమార్‌ యాదవ్‌ (ఐపీఎల్‌)
2 – టామ్‌ బాంటన్‌

రికెల్టన్‌ను ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్ 2025 వేలంలో కేవలం రూ.1 కోటికే సొంతం చేసుకుంది. ఇతగాడు ఇప్పటికే ఎంఐ ఫ్రాంచైజీల తరఫున అత్యంత కీలకమైన ఆటగాడిగా మారిపోయాడు.

ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 55 బంతులు ఎదుర్కొన్న రికెల్టన్‌ 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయమైన 123 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో రికెల్టన్‌ మరో రికార్డు  కూడా నెలకొల్పాడు. ఐపీఎల్‌ చరిత్రలో ముంబై ఇండియన్స్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున అత్యధిక స్కోర్‌
123 (నాటౌట్‌)- ర్యాన్‌ రికెల్టన్‌‌
114 (నాటౌట్‌)- సనత్‌ జయసూర్య
112 (నాటౌట్‌)- క్వింటన్‌ డికాక్‌
109 (నాటౌట్‌)- రోహిత్‌ శర్మ
105 (నాటౌట్‌)- రోహిత్‌ శర్మ
103 (నాటౌట్‌)- సూర్యకుమార్‌ యాదవ్‌

కాగా, ఈ మ్యాచ్‌లో గాయపడిన డికాక్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన రికెల్టన్‌ రికార్డు శతకం బాది ముంబై ఇండియన్స్‌కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాడు. ఎందుకంటే, రికెల్టన్‌ సెంచరీకి ముందు డికాక్ కూడా ఓ అద్భుత శతకం బాదాడు. దీంతో తదుపరి మ్యాచ్‌ల్లో ఎవరిని ఆడించాలో మేనేజ్‌మెంట్‌కు అర్దం కావట్లేదు.

భారీ స్కోర్‌
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ భారీ స్కోర్‌ చేసింది. ర్యాన్‌ రికెల్టన్‌ (123 నాటౌట్‌) అజేయ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో విల్‌ జాక్స్‌ 46, సూర్యకుమార్‌ యాదవ్‌ 5, నమన్‌ ధిర్‌ 22, హార్దిక్‌ పాండ్యా 31, తిలక్‌ వర్మ 7, రాబిన్‌ మింజ్‌ 1 (నాటౌట్‌) పరుగు చేశారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో హింగే 2, ఎషాన్‌ మలింగ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, సాకిబ్‌ తలో వికెట్‌ తీశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement