Ind Vs Aus: టీమిండియాకు భారీ షాక్‌! కీలక ఆటగాడు దూరం! ఇలాగైతే డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరేదెట్లా?!

Report BCCI Official: Bumrah To Miss New Zealand Series Australia Also - Sakshi

Ind Vs NZ And Ind Vs Aus Series- Jasprit Bumrah: టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను గాయాల బెడద వెంటాడుతోంది. వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని, ఫిట్‌గా ఉన్నాడంటూ గత మంగళవారం సెలక్టర్లు శ్రీలంకతో వన్డేల కోసం అతడిని జట్టులోకి ఎంపిక చేశారు. అయితే తొలి వన్డేకు ఒకరోజు ముందు పరిస్థితి మారింది. గత రెండు రోజులుగా ముంబైలో ప్రాక్టీస్‌ చేస్తున్న అతనికి వెన్ను గాయం తిరగబెట్టింది.

దాంతో సహచరులతో పాటు బుమ్రా గువహటికి వెళ్లలేదు. ‘లంకతో వన్డే సిరీస్‌లో బుమ్రా ఆడటం లేదు. అతను పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేసేందుకు మరికొంత సమయం అవసరం. ముందు జాగ్రత్తగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. అతని స్థానంలో ఎవరినీ ఎంపిక చేయడం లేదు’ అని బీసీసీఐ ప్రకటించింది. 

సిరీస్‌ మొత్తానికీ దూరం!
అయితే ప్రస్తుత గాయం తీవ్రత ఏమిటనే దానిపై స్పష్టత లేదు. లంకతో సిరీస్‌ కాదన్నా... 18 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో ఆడతాడా అనేదీ చెప్పలేని పరిస్థితి! అయితే ఈ రెండింటికి మించి ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌లో అతను బరిలోకి దిగడం ఎంతో అవసరం. పరిస్థితి చూస్తుంటే అదీ సందేహంగానే ఉంది. ముందుగా తొలి టెస్టుకు దూరం కావచ్చని అనిపించినా... సిరీస్‌ మొత్తం కూడా దూరమయ్యే ప్రమాదమూ లేకపోలేదు. 

బీసీసీఐ అధికారి కీలక వ్యాఖ్యలు
బీసీసీఐ అధికారి ఒకరు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ‘‘న్యూజిలాండ్‌ సిరీస్‌కు కూడా తనను ఎంపిక చేయబోము. తను పూర్తిగా కోలుకోవాల్సి ఉంది. రిహాబిలిటేషన్‌ సెంటర్‌లోనే కొన్నాళ్లపాటు ఉంటాడు. అంతేకాదు.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు సైతం అందుబాటులో ఉంటాడో లేదో చెప్పలేని పరిస్థితి. 

మరికొన్ని వారాలు గడిచిన తర్వాతే బుమ్రా విషయంపై స్పష్టతకు రాగలం’’ అని సదరు అధికారి పేర్కొన్నట్లు ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌ కథనం వెల్లడించింది. కాగా బుమ్రా విషయంలో ఏమాత్రం తొందరపడదల్చుకోలేదని, స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్‌ కోసం అతను ఉంటే చాలని బోర్డు వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. కాగా వెన్ను నొప్పి కారణంగా ఇప్పటికే ఆసియా టీ20 కప్‌ 2022, టీ20 ప్రపంచకప్‌-2022 వంటి మేజర్‌ టోర్నీలకు బుమ్రా దూరమైన విషయం తెలిసిందే. 

డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసు.. బుమ్రా లేకుంటే!
టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌ చేరాలంటే ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. లేదంటే శ్రీలంక- న్యూజిలాండ్‌ సిరీస్‌ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆసీస్‌ ఫైనల్‌కు చేరగా.. రెండో స్థానం కోసం భారత్‌- లంక మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో బుమ్రా వంటి ప్రధాన పేసర్‌ గనుక దూరమైదే కచ్చితంగా టీమిండియా ఫైనల్‌ అవకాశాలపై ‍ప్రభావం పడుతుంది.

చదవండి: Rohit Sharma: ఎందుకు ఏడుస్తున్నావు? నీ బూరె బుగ్గలు భలే బాగున్నాయి! వీడియో వైరల్‌
Rohit Sharma: నేను అంతర్జాతీయ టి20లకు గుడ్‌బై చెప్పలేదు.. అయితే ఐపీఎల్‌ తర్వాత!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top