బెంగళూరు ఖాతాలో నాలుగో విజయం
5 వికెట్లతో ఓడిన లక్నో
రాణించిన సలామ్, భువీ, కోహ్లి
బెంగళూరు: సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ‘హ్యాట్రిక్’ విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన ఏకపక్ష పోరులో గెలిచి అగ్రస్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (32 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ముకుల్ చౌదరి (28 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆయుశ్ బదోని (24 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
ఆర్‌సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ (4/24) లక్నోను పడగొట్టగా... భువనేశ్వర్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం బెంగళూరు 15.1 ఓవర్లలో 5 వికెట్లకు 149 పరుగులు చేసి విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లి (34 బంతుల్లో 49; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్‌స్కోరర్‌గా నిలవగా...రజత్ పాటీదార్ (13 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్‌లు), జితేశ్ శర్మ (9 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో మరో 29 బంతులు ఉండగానే ఆర్‌సీబీ గెలుపు ఖాయమైంది. మూడు కీలక వికెట్లు తీసిన రసిఖ్ సలామ్‌కు కాకుండా ఒక వికెట్ పడగొట్టిన హాజల్‌వుడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు ఇవ్వడం గమనార్హం.
సమష్టి వైఫల్యం...
చిన్నస్వామి స్టేడియంలో లక్నో ఇన్నింగ్స్ పేలవంగా ప్రారంభమైంది. మొత్తం పవర్‌ప్లేలో ఆ జట్టు 1 ఫోర్, 2 సిక్స్‌లతో 35 పరుగులే చేయగలిగింది. మార్క్‌రమ్ (12) విఫలం కాగా, మార్ష్ మాత్రం ఫర్వాలేదనిపించాడు. పూరన్ (1) తన వైఫల్యాన్ని కొనసాగించగా, కృనాల్ తన వరుస ఓవర్లలో మార్ష్ , సమద్ (0)లను వెనక్కి పంపించాడు. ఇలాంటి స్థితిలో బదోని కొన్ని చక్కటి షాట్లతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు.
మరోవైపు నుంచి ముకుల్ కూడా అతనికి అండగా నిలిచాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా జార్జ్ లిండే (7)ను బరిలోకి దించినా లాభం లేకపోయింది. ఆర్‌సీబీ పదునైన బౌలింగ్ ముందు మిగతా బ్యాటర్లూ తేలిపోయారు. ఆఖరి 4 ఓవర్లలో లక్నో జట్టు 5 వికెట్లు చేజార్చుకొని 29 పరుగులే చేసింది.
కోహ్లి తొలిసారి...
ఛేదనలో సాల్ట్ (7) తొందరగానే అవుటైనా... కోహ్లి జోరుగా మొదలు పెట్టాడు. గత మ్యాచ్‌లో మడమ గాయంతో ఫీల్డింగ్ చేయని కోహ్లి ఈ మ్యాచ్‌లో కూడా నేరుగా బ్యాటింగ్‌కే వచ్చాడు. ఐపీఎల్‌లో అతను మొదటిసారి ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగాడు. ప్రిన్స్ వేసిన నాలుగో ఓవర్లో అతను 4 ఫోర్లు బాదాడు. కోహ్లి తాను ఆడిన తొలి 14 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 34 పరుగులు సాధించడం విశేషం!
మరో ఎండ్‌లో పడిక్కల్ (10) విఫలమైనా... పాటీదార్, జితేశ్ దూకుడుతో ఆర్‌సీబీ వేగంగా లక్ష్యం దిశగా దూసుకుపోయింది. షమీ ఓవర్లో పాటీదార్ రెండు వరుస సిక్స్‌లు కొట్టగా... రాఠీ ఓవర్లో జితేశ్ వరుసగా 6, 4, 6, 4 బాదాడు. వీరిద్దరు ఒకే ఓవర్లో అవుటైనా...మిగిలిన 25 పరుగులను బెంగళూరు తర్వాతి 15 బంతుల్లో సాధించి మ్యాచ్ ముగించింది.
స్కోరు వివరాలు
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మిచెల్ మార్ష్ (బి) కృనాల్ పాండ్యా 40; మార్క్‌రమ్ (సి) పడిక్కల్ (బి) సలామ్ 12; పంత్ (సి) సాల్ట్ (బి) భువనేశ్వర్ 1; నికోలస్ పూరన్ (బి) హాజల్‌వుడ్ 1; ఆయుశ్ బదోని (సి) జితేశ్ (బి) సలామ్ 38; సమద్ (సి) పాటీదార్ (బి) కృనాల్ పాండ్యా 0; ముకుల్ (బి) సలామ్ 39; లిండే (సి) డేవిడ్ (బి) భువనేశ్వర్ 7; షమీ (బి) భువనేశ్వర్ 0; అవేశ్ (బి) సలామ్ 1; దిగ్వేశ్ రాఠీ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 146. వికెట్ల పతనం: 1–32, 2–35, 3–71, 4–83, 5–118, 6–124, 7–137, 8–137, 9–145, 10–146. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–27–3, హాజల్‌వుడ్ 4–0–20–1, రసిఖ్ సలామ్ 4–0–24–4, కృనాల్ పాండ్యా 4–0–38–2, సుయాశ్ శర్మ 4–0–34–0.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (బి) ప్రిన్స్ 7; కోహ్లి (సి) పూరన్ (బి) అవేశ్ 49; పడిక్కల్ (సి) (సబ్) హిమ్మత్ (బి) అవేశ్ 10; రజత్ పాటీదార్ (సి) రాఠీ (బి) ప్రిన్స్ 27; జితేశ్ (సి) ముకుల్ (బి) ప్రిన్స్ 23; డేవిడ్ (నాటౌట్) 14; షెఫర్డ్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15.1 ఓవర్లలో 5 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–9, 2–66, 3–86, 4–121, 5–122. బౌలింగ్: షమీ 3–0–30–0, ప్రిన్స్ యాదవ్ 3–0–32–3, దిగ్వేశ్ రాఠీ 4–0–51–0, అవేశ్ ఖాన్ 4–0–23–2, లిండే 1.1–0–9–0.
పంత్‌కు గాయం...
హాజల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో బంతి బలంగా తగలడంతో లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ (1) ఎడమ మోచేతికి గాయమైంది. మూడు బంతులు ఆడిన అనంతరం అతను రిటైర్డ్‌హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత 16వ ఓవర్లో తిరిగి బ్యాటింగ్‌కు వచ్చినా మరో మూడు బంతులే ఆడి అతను అవుటయ్యాడు. పంత్ గాయం తీవ్రత ఇంకా తెలియాల్సి ఉంది. అతను కీపింగ్ కూడా చేయకపోవడంతో ముకుల్ చౌదరి ఆ బాధ్యత తీసుకున్నాడు.
ఐపీఎల్‌లో నేడు
ముంబై X పంజాబ్
వేదిక: ముంబై
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం


