#Jadeja-Green: అడ్డుకునేలోపే అదిరిపోయే ట్విస్ట్‌.. జడ్డూ దెబ్బకు మైండ్‌బ్లాక్‌

Ravindra Jadeja Stunning Delivery Clean-Bowled Cameron Green Left-Shock - Sakshi

డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తన స్పిన్‌ మ్యాజిక్‌ను మరోసారి చూపెట్టాడు. నాలుగోరోజు ఆట ఆరంభంలోనే లబుషేన్‌ ఔటైనప్పటికి క్రీజులో ఉన్న గ్రీన్‌, అలెక్స్‌ కేరీలు పట్టుదలగా ఆడారు. దీంతో మరో వికెట్‌ పడదేమో అనుకుంటున్న తరుణంలో జడ్డూ తన బౌలింగ్‌ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. 

ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 63వ ఓవర్‌ జడేజా బౌలింగ్‌ చేశాడు. 25 పరుగులతో నిలకడ చూపిస్తున్న గ్రీన్‌ అప్పటికే ఓపికగా నాలుగు బంతులు ఎదుర్కొన్నాడు. ఇంకా ఒక్క బంతి ఆపితే ఓవర్‌ పూర్తవుతుంది. అయితే జడ్డూ ఆరో బంతిని కాస్త తెలివిగా ఔట్‌సైడ్‌ లెగ్‌ దిశగా వేశాడు. గ్రీన్‌కు ఆ బంతి ఆడే ఉద్దేశం లేకపోవడంతో బ్యాట్‌ను అడ్డుపెట్టాడు.

కానీ ఎవరు ఊహించని విధంగా లోటర్న్‌ అయిన బంతి గ్రీన్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకి పైకి లేచి నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో గ్రీన్‌కు ఏం జరిగిందో కాసేపు అర్థం కాక షాక్‌లో ఉండిపోయాడు. తర్వాత చేసేదేంలేక నిరాశతో పెవిలియన్‌ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

బిషన్‌సింగ్‌ బేడీ రికార్డు బద్దలు
ఈ క్రమంలో జడేజా టెస్టుల్లో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌గా టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జడేజా రికార్డులకెక్కాడు. గ్రీన్‌ను ఔట్‌ చేయడం ద్వారా జడేజా 268వ వికెట్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో బిషన్‌ సింగ్‌ బేడీ(266 వికెట్లు)ని క్రాస్‌ చేసి ఓవరాల్‌ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో రంగనా హెరాత్‌(433 వికెట్లు), డేనియల్‌ వెటోరి(362 వికెట్లు), డ్రీక్‌ అండర్‌వుడ్‌(298 వికెట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

చదవండి: ఉమేశ్‌ యాదవ్‌ వైల్డ్‌ రియాక్షన్‌ వెనుక కారణం అదేనా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top