రషీద్‌ ఖాన్‌ మరో ఘనత | Rashid Khan Surpasses Mumbai Indians Legend With Stunning Spell Vs Rajasthan Royals | Sakshi
Sakshi News home page

రషీద్‌ ఖాన్‌ మరో ఘనత

May 10 2026 12:51 PM | Updated on May 10 2026 1:39 PM

Rashid Khan Surpasses Mumbai Indians Legend With Stunning Spell Vs Rajasthan Royals

ఆఫ్ఘనిస్తాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ఐపీఎల్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు. నిన్న (మే 9) రాజస్థాన్‌ రాయల్స్‌తో  జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు తీయడంతో ఐపీఎల్‌ ఆల్‌టైమ్‌ హైయ్యెస్ట్‌ వికెట్‌ టేకర్ల టాప్‌-10 జాబితాలో ప్రవేశించాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌ దిగ్గజం లసిత్‌ మలింగ (170 వికెట్లు) రికార్డును అధిగమించాడు.

తాజా ప్రదర్శనతో ఐపీఎల్‌లో రషీద్‌ వికెట్ల సంఖ్య 173కు చేరింది. ప్రస్తుతం అతను 10వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో చహల్‌ 229 వికెట్లతో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. భువనేశ్వర్‌ కుమార్‌ (215), సునీల్‌ నరైన్‌ (202), పియుశ్‌ చావ్లా (192), రవిచంద్రన్‌ అశ్విన్‌ (187), బుమ్రా (186), డ్వేన్‌ బ్రావో (183), రవీంద్ర జడేజా (178), అమిత్‌ మిశ్రా (174) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు.

మ్యచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌ (84), సాయి సుదర్శన్‌ (55) మెరుపు అర్ద శతకాలతో సత్తా చాటారు. వాషింగ్టన్‌ సుందర్‌ (37 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. మిగతా బ్యాటర్లలో జోస్‌ బట్లర్‌ 13, జేసన్‌ హెల్డర్‌ 7, రాహుల్‌ తెవాతియా 14 (నాటౌట్‌) పరుగులు చేశారు. రాయల్స్‌ బౌలర్లలో బ్రిజేష్‌ శర్మ 2, యశ్‌ రాజ్‌ పూనియా, రవీంద్ర జడేజా తలో వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో రాయల్స్‌ తడబడింది. రషీద్‌ ఖాన్‌ (4-033-4), జేసన్‌ హెల్డర్‌ (2.3-0-12-3), రబాడ (3-0-33-2), సిరాజ్‌ (4-0-55-1) ధాటికి 16.3 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది. 38 పరుగులు చేసిన జడేజా టాప్‌ స్కోరర్‌ కాగా.. వైభవ్‌ సూర్యవంశీ (36), ధృవ్‌ జురెల్‌ (24), షనక (16), శుభమ్‌ దూబే (15) రెండంకెల స్కోర్లు చేశారు. జైస్వాల్‌ (3), హెట్‌మైర్‌ (6), ఫెరియెరా (4), ఆర్చర్‌ (5), తుషార్‌ దేశ్‌పాండే (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ గెలుపుతో గుజరాత్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. రాయల్స్‌ ఐదో ప్లేస్‌కు పడిపోయింది.

 

Advertisement
 
Advertisement
Advertisement