రషీద్‌ ఖాన్‌పై చర్యలు ఉంటాయా..? | Is Rashid Khan Going To Be Punished For Leaking BCCI Citizenship Bait | Sakshi
Sakshi News home page

రషీద్‌ ఖాన్‌పై చర్యలు ఉంటాయా..?

Apr 21 2026 10:37 AM | Updated on Apr 21 2026 11:39 AM

Is Rashid Khan Going To Be Punished For Leaking BCCI Citizenship Bait

భారత్‌, ఆస్ట్రేలియా దేశాలు తనకు పౌరసత్వం ఆఫర్‌ చేశాయని, వారి దేశాల తరఫున క్రికెట్‌ అవకాశాలు కూడా కల్పిస్తామని ముందుకువచ్చాయని, అయితే తాను వాటిని సున్నితంగా తిరస్కరించారని ఆఫ్ఘనిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ తన పుస్తకం "Rashid Khan: From Streets to Stardom" ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. 

ఈ అంశం ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత పౌరసత్వం ఆఫర్‌ను బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తన ముందు ఉంచారని రషీద్‌ పేర్కొనడంతో బోర్డు పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గోప్యంగా ఉంచాల్సిన విషయాన్ని బహిర్గతం చేసిన నేపథ్యంలో రషీద్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంటుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ అంశాన్ని లోతుగా పరిశీలించగా.. రషీద్‌ చేసిన పనికి చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకమైన నిబంధనలేవీ లేదని తెలుస్తుంది. అయితే బోర్డు ప్రతిష్ఠకు భంగం కలిగిందని భావిస్తే మాత్రం బీసీసీఐ వివరణ కోరే అవకాశం ఉంది. అవసరమైతే ఆధారాలు చూపాలని కూడా కోరవచ్చు.

కఠిన చర్యలు తీసుకునే అవకాశాన్ని కూడా నిపుణులు కొట్టిపారేయడం లేదు. చర్యల్లో భాగంగా ఐపీఎల్‌లో పాల్గొనడంపై పరిమితులు విధించడం లేదా నిషేధం విధించడం వంటి చర్యలు ఉండవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

అయితే ఇలాంటి చర్యలకు బలమైన ఆధారాలు అవసరం అవుతాయి. ప్రస్తుతానికి బీసీసీఐ ఈ అంశాన్ని పక్కను పెట్టిందని తెలుస్తుంది. ఒకవేళ పరిశీలనలోకి వస్తే మాత్రం ఏమైనా జరగవచ్చు. బోర్డు పెద్దల్లో చాలామందికి రషీద్‌పై సానుకూల అభిప్రాయం ఉంది కాబట్టి వార్నింగ్‌తో సరిపెట్టవచ్చు. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత బీసీసీఐ ఈ అంశాన్ని పరిశీలించే అవకాశం ఉంది.

కాగా, రషీద్‌ ప్రస్తుతం ఐపీఎల్‌ 2026లో గుజరాత్‌ టైటాన్స​్‌ తరఫున బిజీగా ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీసి, ఓ మోస్తరు ప్రదర్శనలు చేస్తున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లలో వికెట్‌ తీయలేకపోయినా పొదుపుగా (31 పరుగులు) బౌలింగ్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ ముంబై చేతిలో చిత్తుగా ఓడింది. 

Advertisement
 
Advertisement
Advertisement