బాంబు పేల్చిన రషీద్‌ ఖాన్‌ | Rashid Khan Drops Retirement Bombshell | Sakshi
Sakshi News home page

బాంబు పేల్చిన రషీద్‌ ఖాన్‌

Apr 9 2026 3:00 PM | Updated on Apr 9 2026 3:55 PM

Rashid Khan Drops Retirement Bombshell

ఐపీఎల్‌ 2026లో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌, తన అంతర్జాతీయ కెరీర్‌పై ఆసక్తికర ప్రకటన చేశాడు. నిన్న (ఏప్రిల్‌ 8) ఢిల్లీ క్యాపిటల్స్‌పై మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శన (3-17) చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన అతను.. టెస్ట్‌ క్రికెట్‌ నుంచి తప్పుకోవచ్చన్న సంకేతాన్ని ఇచ్చి బాంబు పేల్చాడు.

మ్యాచ్‌ అనంతరం రషీద్‌ మాట్లాడుతూ.. టెస్ట్‌ క్రికెట్‌ ఆడొద్దని డాక్టర్లు చెప్పారు. అయినా నేను ఆడాను. గతేడాది జింబాబ్వేపై ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో 67 ఓవర్లు వేశాను. ఈ చర్య నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. నేను ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో ఇన్ని ఓవర్లు వేశానని తెలిసి డాక్టర్లు షాక్‌ అయ్యారు. ఇకపై టెస్ట్‌లు ఆడే సాహసం చేస్తే, ఎక్కువ కాలం క్రికెట్‌లో కొనసాగలేనని హెచ్చరించినట్లు వెల్లడించాడు.  

కాగా, రషీద్‌ ఖాన్‌ 2023 నుంచి వెన్ను గాయాలతో ఇబ్బందులు పడుతున్నాడు. శస్త్రచికిత్స కూడా జరిగింది. వైద్యులు రెడ్‌బాల్‌ క్రికెట్‌ ఆడొద్దని స్పష్టంగా సూచించారు. అయినా రషీద్‌ గతేడాది జింబాబ్వేపై టెస్ట్‌ మ్యాచ్‌ ఆడి ఏకంగా 67 ఓవర్లు వేశాడు. ఈ నిర్ణయం అతని ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది.  

రషీద్‌ 2023 వన్డే వరల్డ్‌ కప్‌ కోసం శస్త్రచికిత్స వాయిదా వేసుకున్నాడు. ఆతర్వాత యూకేలో సర్జరీ చేయించుకున్నాడు. 2024లో తిరిగి వచ్చాడు. వరుసగా ఫ్రాంచైజీ క్రికెట్‌ ఆడటం వల్ల గాయాలు తిరగబెట్టాయి. ఫలితంగా కొంతకాలం ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు పడ్డాడు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లోనే అతను తిరిగి గాడిలో పడ్డాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు తీశాడు. బ్యాట్‌తోనూ పర్వాలేదనిపించాడు. 

రషీద్‌ టెస్ట్‌ కెరీర్‌ను పరిశీలిస్తే.. ఆఫ్ఘనిస్తాన్‌ 2017లో టెస్ట్‌ హోదా పొందినప్పటి నుంచి 12 మ్యాచ్‌లు ఆడగా, రషీద్‌ కేవలం 6 టెస్ట్‌ల్లో మాత్రమే పాల్గొన్నాడు. చివరిసారి అతను 2025లో జింబాబ్వేపై టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాడు. ఆ మ్యాచ్‌లో 67 ఓవర్లు వేసి 11 వికెట్లు తీశాడు. మొత్తంగా రషీద్‌ తన టెస్ట్‌ కెరీర్‌లో 6 మ్యాచ్‌ల్లో 45 వికెట్లు తీశాడు. 
 

Advertisement
 
Advertisement
Advertisement