IPL 2021: విండీస్‌ విధ్వంసకర ఆటగాడిని దక్కించుకున్న రాజస్తాన్‌ రాయల్స్‌

Rajasthan Royals Rope In Evin Lewis And Oshane Thomas - Sakshi

న్యూఢిల్లీ: సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఐపీఎల్ పార్ట్-2 నుంచి పలువురు ఆటగాళ్లు వివిధ కారణాలు చేత తప్పుకోవడంతో ఆయా ఫ్రాంచైజీలు వారి స్థానాలను భర్తీ చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇదివరకే చాలా జట్లు రిప్లేస్‌మెంట్‌ ఆటగాళ్లును ఎంపిక చేసుకున్నాయి. తాజాగా, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు వ్యక్తిగత కారణాల చేత లీగ్‌కు దూరంగా ఉన్న జోస్‌ బట్లర్‌ స్థానాన్ని విండీస్‌ విధ్వంసకర యోధుడు ఎవిన్‌ లూయిస్‌తో భర్తీ చేయాలని నిర్ణయించింది. అలాగే గాయం కారణంగా లీగ్‌ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ప్లేస్‌ను విండీస్‌కే చెందిన ఒషేన్‌ థోమాస్‌తో రీప్లేస్‌ చేయనున్నట్లు ప్రకటించింది. గతంలో ఒషేన్‌ థోమాస్‌కు ఐపీఎల్‌లో ఇదే జట్టుకు 4 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది.  

ఇక ఎవిన్‌ లూయిస్‌ విషయానికొస్తే.. ఈ పవర్‌ హిట్టర్‌ గతంలో ముంబై ఇండియన్స్‌ జట్టుకు 16 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ముంబై తరఫున అతను 131 స్ట్రయిక్‌ రేట్‌తో 430 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్‌ సెంచరీలు కూడా ఉన్నాయి. కాగా, ఎవిన్‌ లూయిస్‌కు అంతర్జాతీయ టీ20ల్లో హార్డ్‌ హిట్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. అతను విండీస్‌ తరఫున 45 మ్యాచ్‌ల్లో 158 స్ట్రయిక్‌ రేట్‌తో 1318 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలు, 9 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, సంజూ సామ్సన్‌ నేతృత్వంలోని ఆర్‌ఆర్‌ జట్టు ఐపీఎల్‌ సెకెండ్‌ లెగ్‌లో తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 21న ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌ఆర్‌.. పంజాబ్‌ కింగ్స్‌ను ఢీకొంటుంది. ప్రస్తుత సీజన్‌లో ఆర్‌ఆర్‌ జట్టు ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 4 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. 
చదవండి: ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడండి.. టీమిండియా దెబ్బ తిన్న పులిలా గర్జిస్తుంది

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top