సింధు ముందంజ | PV Sindhu downs World No 6 to advance to Singapore Open second round | Sakshi
Sakshi News home page

సింధు ముందంజ

May 27 2026 2:12 AM | Updated on May 27 2026 2:12 AM

PV Sindhu downs World No 6 to advance to Singapore Open second round

తొలి రౌండ్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్‌పై విజయం

సింగపూర్‌: ఏడాదిన్నర కాలంగా టైటిల్‌కు దూరంగా ఉన్న భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు మరో టోర్నీలో శుభారంభం చేసింది. మంగళవారం మొదలైన సింగపూర్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీలో సింధు సంచలన విజయంతో బోణీ కొట్టింది. ప్రపంచ ఆరో ర్యాంకర్‌ పుత్రి కుసుమ వర్థిని (ఇండోనేసియా)తో జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్‌ సింధు 21–17, 21–18తో గెలుపొంది ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో సింధు ముఖాముఖి రికార్డును 3–3తో సమం చేసింది. 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు రెండు గేముల్లోనూ ఒకదశలో వెనుకబడింది.

 కానీ ఆందోళన చెందకుండా తన అనుభవాన్నంతా రంగరించి సంయమనంతో పోరాడింది. తొలి గేమ్‌లో 8–13తో, 11–15తో వెనుకంజలో ఉన్నదశలో సింధు నెమ్మదిగా తేరుకొని 15–15తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత స్కోరు 16–16తో ఉన్న తరుణంలో సింధు వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 20–16తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం ఒక పాయింట్‌ను ప్రత్యర్థికి కోల్పోయి, ఆ వెంటనే మరో పాయింట్‌ గెలిచి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌ నువ్వా నేనా అన్నట్లు జరిగింది. పలుమార్లు ఆధిక్యం దోబూచులాడినా చివరకు సింధునే పైచేయి సాధించింది. మహిళల సింగిల్స్‌ మరో మ్యాచ్‌లో ఉన్నతి హుడా 14–21, 10–21తో టొమోకా మియజకి (జపాన్‌) చేతిలో ఓడిపోయింది.

శ్రమించి గెలిచిన సాత్విక్‌–చిరాగ్‌ జోడీ
పురుషుల డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ అతికష్టమ్మీద తొలి రౌండ్‌ అడ్డంకిని దాటింది. చెన్‌ జి యి–ప్రెస్లీ స్మిత్‌ (మలేసియా) జంటతో 75 నిమిషాలపాటు జరిగిన పోరులో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 26–28, 21–15, 21–13తో గెలుపొంది ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. భారత్‌కే చెందిన హరిహరన్‌–ఎంఆర్‌ అర్జున్‌ 15–21, 13–21తో టకురో హొకి–యుగో కొబయాషి (జపాన్‌) చేతిలో ఓడిపోయారు. 

మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో గద్దె రుతి్వక శివాని–రోహన్‌ కపూర్‌ (భారత్‌) ద్వయం 18–21, 20–22తో యాంగ్‌ పో సువాన్‌–హు లింగ్‌ ఫాంగ్‌ (చైనీస్‌ తైపీ) జంట చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో భారత రైజింగ్‌ స్టార్‌ ఆయుశ్‌ శెట్టి 21–11, 14–21, 12–21తో విక్టర్‌ లాయ్‌ (కెనడా) చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో కవిప్రియ సెల్వం–సిమ్రన్‌ 21–18, 13–21, 5–21తో పౌలా లోపెజ్‌–లూసియా (స్పెయిన్‌) చేతిలో ఓటమి పాలయ్యారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement