
హాంకాంగ్ ఓపెన్ నుంచి తొలి రౌండ్‌లోనే నిష్క్రమణ
అన్‌సీడెడ్ క్రీడాకారిణి చేతిలో ఓటమి
అనుపమ, రక్షిత శ్రీ కూడా అవుట్
హాంకాంగ్: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు వేట ఇంకా కొనసాగనుంది. హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –500 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ 14వ ర్యాంకర్ సింధు తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. ప్రపంచ 27వ ర్యాంకర్, అన్‌సీడెడ్ లినె క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)తో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 21–15, 16–21, 19–21తో ఓటమి పాలైంది.
గతంలో లినె క్రిస్టోఫర్సన్‌తో ఆడిన ఐదుసార్లూ విజయం సాధించిన సింధు ఆరోసారి మాత్రం ఓటమి తప్పలేదు. 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు నిర్ణాయక మూడో గేమ్‌లో 16–13తో, 17–15తో ఆధిక్యంలోకి వెళ్లి విజయం దిశగా సాగింది. ఈ కీలక తరుణంలో సింధు అనవసర తప్పిదాలు చేయడం... 15–17తో వెనుకబడిన లినె వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి ఒక్కసారిగా 19–17తో ముందంజ వేసింది.
ఆ తర్వాత సింధు ఒక పాయింట్ గెలిచినా... ఆ వెంటనే లినె రెండు పాయింట్లు నెగ్గి తన కెరీర్‌లో తొలిసారి భారత స్టార్‌పై విజయాన్ని ఖాయం చేసుకుంది. భారత్‌కే చెందిన అనుపమ, రక్షిత శ్రీ కూడా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. అనుపమ 17– 21, 22–20, 14–21తో తొమ్మిదో ర్యాంకర్ టొమోకా మియకాజి (జపాన్) చేతిలో, రక్షిత శ్రీ 13–21, 7–21తో ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయారు.
లక్ష్య సేన్, ప్రణయ్ ముందంజ
పురుషుల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన నలుగురు భారత క్రీడాకారులు లక్ష్య సేన్, ప్రణయ్, కిరణ్ జార్జి, ఆయుశ్ శెట్టి శుభారంభం చేశారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో లక్ష్య సేన్ 22–20, 16–21, 21–15తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై, ప్రణయ్ 21–17, 21–14తో లు గ్వాంగ్ జు (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లో ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యారు. కిరణ్ జార్జి 21–16, 21–11తో జియా హెంగ్ జేసన్ (సింగపూర్)పై, ఆయుశ్ 15–21, 21–19, 21–13తో సు లి యాంగ్ (చైనీస్ తైపీ)లపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు.
మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో రుతపర్ణ–శ్వేతాపర్ణ (భారత్) ద్వయం 21–17, 21–9తో పాంగ్ వనెస్సా–వాంగ్ సమ్ (హాంకాంగ్) జంటను ఓడించింది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో గద్దె రుత్విక శివాని–రోహన్ (భారత్) జోడీ 14–21, 17–21తో ప్రపంచ రెండో ర్యాంక్ జంట ఫెంగ్ యాన్ జె–హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా) చేతిలో... తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 16– 21, 11–21తో చెన్ చెంగ్ కువాన్–సు యిన్ హుయ్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయాయి.